ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా మారుతోంది ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’. వాతావరణ మార్పులు, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సూక్ష్మజీవులు నీటి వనరుల్లో వేగంగా విస్తరిస్తున్నాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. పర్యావరణం, ప్రజారోగ్య రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు ‘బయోకంటామినెంట్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భవిష్యత్తులో ఈ ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా మట్టి, నీటిలో కనిపించే ఏకకణ జీవులను ‘ఫ్రీ-లివింగ్ అమీబే’గా పిలుస్తారు. వీటిలో చాలా వరకు హానికరం కాకపోయినా, కొన్ని జాతులు మాత్రం ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది ‘నెగ్లేరియా ఫౌలెరి’. కలుషిత నీటిలో ఈత కొట్టడం లేదా నీటిలో తల ముంచినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి నేరుగా మెదడుపై దాడి చేస్తుంది. దీని వల్ల ‘ప్రైమరీ అమేబిక్ మెనింజోఎన్‌సెఫలైటిస్’ అనే తీవ్రమైన వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి అరుదైనదైనా, సోకిన వారిలో దాదాపు 99 శాతం మంది ప్రాణాలు కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో కేరళలో నమోదైన పలు మరణాలకు కూడా ఈ అమీబానే కారణమని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.
చైనాలోని సన్ యట్ సేన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు లాంగ్‌ఫీ షూ మాట్లాడుతూ, ఈ అమీబాలు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా జీవించగలగడం వల్లే ఇవి మరింత ప్రమాదకరంగా మారాయని తెలిపారు. సాధారణంగా సూక్ష్మజీవులు బతకలేని అధిక ఉష్ణోగ్రతలను, క్లోరిన్ వంటి శక్తివంతమైన క్రిమిసంహారకాలను కూడా ఈ అమీబాలు తట్టుకుంటాయి. సురక్షితమని భావించే తాగునీటి పంపిణీ వ్యవస్థలలో కూడా ఇవి జీవించగలవని ఆయన హెచ్చరించారు. భూమి వేడెక్కుతున్న కొద్దీ, వేడి నీటిని ఇష్టపడే ఈ అమీబాలు కొత్త ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.