వెనెజులాపై అమెరికా శనివారం చేపట్టిన భారీ సైనిక దాడి అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ దాడిలో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను బంధించి దేశం వెలుపలికి తరలించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా ప్రకటించారు. అమెరికా తీసుకున్న ఈ చర్యను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలు ఇది వెనెజులా సార్వభౌమాధికారంపై, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన ఘోర దాడిగా అభివర్ణించాయి. లాటిన్ అమెరికా ప్రాంతంలో మళ్లీ అస్థిరత చెలరేగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికా చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వెనెజులాపై జరిగిన ఈ దాడిని ఏ విధంగానూ సమర్థించలేమని, దీనికి ఉపయోగిస్తున్న కారణాలు నిలకడలేనివని స్పష్టం చేసింది. ఇది కేవలం సైద్ధాంతిక శత్రుత్వం, రాజకీయ స్వార్థాల కారణంగానే జరిగిన దాడి అని రష్యా ఆరోపించింది. లాటిన్ అమెరికా శాంతియుత ప్రాంతంగా కొనసాగాలని, వెనెజులా తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే హక్కును గౌరవించాలని రష్యా పేర్కొంది. ఈ సంక్షోభంపై తక్షణమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని వెనెజులా చేసిన డిమాండ్‌కు రష్యా పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. వెనెజులా ప్రజలకు తమ సంఘీభావం ఎప్పుడూ ఉంటుందని కూడా వెల్లడించింది.
క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డియాజ్-కెనెల్ అమెరికా దాడిని తీవ్ర పదజాలంతో ఖండించారు. ఇది వెనెజులా ప్రజలపై జరిగిన నేరపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ఈ దాడి అగ్రరాజ్య ఉగ్రవాదానికి మరో నిదర్శనమని పేర్కొన్నారు. వెనెజులా ధైర్యవంతులైన ప్రజలను భయపెట్టే ప్రయత్నమే ఈ చర్య అని విమర్శించారు. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ కూడా అమెరికా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఒక స్వతంత్ర దేశంపై సైనిక దాడి చేయడం పిరికిపంద చర్య అని, అంతర్జాతీయ చట్టాలకు ఇది పూర్తి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్ విదేశాంగ శాఖ కూడా అమెరికా దాడిపై ఘాటుగా స్పందించింది. ఈ చర్యను దురాక్రమణ చర్యగా అభివర్ణిస్తూ, ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ప్రాథమిక సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించిందని పేర్కొంది. వెనెజులాకు తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే పూర్తి హక్కు ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా చేపట్టిన ఈ ‘దండయాత్ర’ను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ సమాజం తన చట్టపరమైన, నైతిక బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చింది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా జియోపాలిటికల్ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.