గుంటూరు నగరంలోని మానస సరోవరం పార్క్ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకప్పుడు వేలాది మంది సందర్శకులతో కళకళలాడిన ఈ ఉద్యానవనం, కాలక్రమేణా నిర్లక్ష్యం కారణంగా అధ్వాన స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఈ పార్క్‌ను మళ్లీ పూర్వ వైభవంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో, నగరవాసుల్లో ఆశలు పెరిగాయి.
రూ.18.35 కోట్ల వ్యయంతో మానస సరోవరం పార్క్ అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సాస్కీ పథకం (2025–26) ద్వారా నిధులు సమకూర్చి, ప్రైవేట్–పబ్లిక్ భాగస్వామ్య (PPP) విధానంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఐదు నెలల క్రితం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పార్కును పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోజుకు సగటున 5 వేల మంది సందర్శకులు రావడం, సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు కావడం జరిగేది. నెలకు రూ.6 లక్షల వరకు ఆదాయం కూడా వచ్చేది. అయితే కోవిడ్ సమయంలో పార్క్ మూసివేయడంతో, నిర్వహణ లోపించి పరికరాలు పాడైపోయాయి, పిచ్చిమొక్కలతో నిండిపోయి పార్క్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఇప్పుడు ఈ పార్క్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ల్యాండ్‌స్కేప్ డెవలప్‌మెంట్, మియావాకీ ప్లాంటేషన్, పర్యాటకులకు అనుకూల వసతులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. జీఎంసీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఈ పనుల కోసం అంచనాలను సిద్ధం చేసి కౌన్సిల్ ఆమోదానికి పంపింది. జీఎంసీ సాధారణ నిధుల నుంచి జంగిల్ క్లియరెన్స్ కోసం రూ.3 లక్షలు కేటాయించారు.
అయితే కొన్ని అభివృద్ధి అంశాలపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ల్యాండ్‌స్కేప్, మియావాకీ ప్లాంటేషన్ కోసం రూ.11 కోట్లు కేటాయించడంపై మరింత స్పష్టత అవసరమని పలువురు సూచిస్తున్నారు. అన్ని ప్రతిపాదనలను పకడ్బందీగా పరిశీలించి, గుంటూరు మిలియన్ ప్లస్ సిటీగా ఎదగడానికి ఈ పార్క్ నిజంగా ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.