కర్నూలు, అనంతపురం జిల్లాలకు మరొక కీలక రైల్వే ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ భారీ ఫ్లైఓవర్‌ను చిప్పగిరి మండలంలోని మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వే స్టేషన్ వరకు నిర్మించనున్నారు.
ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బళ్లారి–డోన్ మధ్య రైలు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రస్తుతం గుంతకల్లు జంక్షన్లో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతుండగా, ఈ పైవంతెన ఆ సమస్యను చాలా వరకు తగ్గించనుంది. ముఖ్యంగా స్టేషన్లోకి ప్రవేశించే రైళ్లకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.
ప్రస్తుతం బళ్లారి, ఆదోని, డోన్, గుత్తి మార్గాల నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు అన్నీ ఒకే మార్గం ద్వారా గుంతకల్లు స్టేషన్లోకి రావాల్సి వస్తోంది. దీనివల్ల రైళ్లు గంటల తరబడి నిలిచిపోతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కొత్త రైల్ ఓవర్ రైల్ వంతెన ద్వారా కొన్ని రైళ్లు స్టేషన్లో ఆగకుండా నేరుగా వెళ్లే వీలు కలుగుతుంది.
గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు దేశంలోని ప్రధాన నగరాల నుంచి రోజూ 58 ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100కు పైగా గూడ్స్ రైళ్లు వస్తుంటాయి. అయితే స్టేషన్లో కేవలం ఏడు ప్లాట్‌ఫారాలు మాత్రమే ఉండటంతో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికుల రైళ్లు బయటే ఆగాల్సి వస్తోంది. దీని వల్ల ఆలస్యం మాత్రమే కాకుండా, చోరీల వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా రైల్వే ఇంజినీర్లు బైపాస్ మార్గాలు, రైల్ ఓవర్ రైల్ వంతెనల నిర్మాణాన్ని సూచించారు. ఇప్పటికే తిరుపతి జిల్లా గూడూరులో ఒకటి, విజయవాడలో మరో రైల్ ఓవర్ రైల్ నిర్మాణ దశలో ఉండగా, గుంతకల్లు వద్ద నిర్మించబోయేది రాష్ట్రంలో మూడవది అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల రాకపోకలు వేగవంతమై, ప్రయాణికుల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.