రైతుల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్‌లు మంచి ఫలితాలు ఇవ్వడంతో, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇకపై ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ రెవెన్యూ క్లినిక్‌లు ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో భాగంగా పనిచేస్తాయి. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల అర్జీలను ఒకే చోట స్వీకరించి, భూ తగాదాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో పరిష్కరించనున్నారు. సాధారణంగా వచ్చే వినతులపై కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంటుంది.
పట్టాదారు పాస్‌పుస్తకం, రీసర్వే, 1/70, ఆర్‌ఓఆర్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ వంటి మొత్తం 14 రకాల భూ సమస్యల కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. అర్జీదారుల సమస్య ఏ విభాగానికి సంబంధించినదో గుర్తించి, నేరుగా ఆ టేబుల్ వద్దకు పంపిస్తారు. దీంతో సమస్యల పరిష్కారం వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.
ప్రతి అర్జీకి ఒక ఆన్‌లైన్ నంబర్ కేటాయించి, దరఖాస్తుదారుల ఫోన్, ఆధార్ వివరాలను నమోదు చేస్తారు. అర్జీ స్వీకరించిన తర్వాత సమస్య పరిష్కారానికి సంబంధించిన కార్యాచరణ వివరాలతో కూడిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారునికి అందిస్తారు. ఈ ప్రక్రియపై డిప్యూటీ కలెక్టర్ సంతకం తప్పనిసరిగా ఉంటుంది.
సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఎక్కువ సమయం అవసరమైతే, నిర్దిష్ట గడువును నిర్ణయించి ఆలోపు పరిష్కారం చేయాలి. ఫీల్డ్ వెరిఫికేషన్, అధికారుల సమీక్ష తర్వాత సమస్యను పరిష్కరిస్తారు. అనంతరం ఐవీఆర్‌ఎస్ ద్వారా అర్జీదారుల అభిప్రాయాలు సేకరించి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.