ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కానుంది. నెల్లూరులోనే తొలి ఇంటర్నేషనల్ స్కూల్‌ను స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ముందడుగు వేసింది. ఈ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.15 కోట్ల వ్యయం చేయనున్నట్లు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా సమీకరించనున్నట్లు ఆయన వివరించారు. నెల్లూరులోని జామియా మసీదుకు చెందిన వక్ఫ్ భూమిలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపట్టనున్నారు. విద్యారంగంలో నాణ్యత పెంచడమే లక్ష్యంగా ఈ స్కూల్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
జామియా మసీదుకు చెందిన మొత్తం 13 ఎకరాల వక్ఫ్ భూమిలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. ఇందులో ఐదు ఎకరాలను ఇంటర్నేషనల్ స్కూల్ కోసం, మూడు ఎకరాలను మసీదుకు సంబంధించిన సౌకర్యాల కోసం కేటాయించనున్నట్లు అజీజ్ తెలిపారు. మిగిలిన భూమిని వక్ఫ్ బోర్డు కార్యకలాపాలకు స్థిర ఆదాయం వచ్చేలా ఉపయోగించనున్నట్లు చెప్పారు.
ఈ ప్రతిపాదనను ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు ఇప్పటికే సమర్పించినట్లు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన దాతలను సమీకరించడంలో మంత్రి నారాయణ పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ ఇంటర్నేషనల్ స్కూల్ పూర్తిగా వక్ఫ్ బోర్డు యాజమాన్యంలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వక్ఫ్ బోర్డు ఆస్తుల ప్రైవేటీకరణపై వస్తున్న పుకార్లను షేక్ అబ్దుల్ అజీజ్ ఖండించారు. వక్ఫ్ ఆస్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, అవి సమాజ సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాల్సినవని పేర్కొన్నారు. ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా నెల్లూరు జిల్లాలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.