ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు సాగు ఖర్చులు తగ్గించే వినూత్న ఆలోచనను అమల్లోకి తెస్తోంది. వ్యవసాయం, ఉద్యాన పంటలు పండించే రైతులకు అవసరమైన ఆధునిక యంత్రాలు, పరికరాలను అద్దె ప్రాతిపదికన అందించేందుకు ‘కస్టమ్ హైరింగ్ సెంటర్లు (CHCs)’ ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రాలను మహిళా రైతులతో కూడిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (FPOs) నిర్వహించనున్నాయి. ఈ విధానంతో రైతుల పెట్టుబడి భారం తగ్గడమే కాకుండా, మహిళా రైతులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా రైతులు తమ పొలాలకు అవసరమైన ట్రాక్టర్లు, నాగళ్లు, విత్తనాల యంత్రాలు, పంట కోత పరికరాలు వంటి అనేక వ్యవసాయ యంత్రాలను తక్కువ అద్దెకు పొందవచ్చు. ఇప్పటివరకు రైతులు ఈ యంత్రాలను సొంతంగా కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా, అవసరమైనప్పుడు మాత్రమే అద్దెకు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీంతో సాగు వ్యయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, మహిళా రైతుల సంఘాలు ఈ కేంద్రాలను నిర్వహించడం వల్ల వారికి ఆర్థిక స్వావలంబనతో పాటు గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు పనిచేస్తుండగా, వీటిలోంచి 300 ఎఫ్‌పీవోలను ఎంపిక చేసి వాటి ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ జీవనోపాధుల మిషన్ (NRLM) కింద రూ.60 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇప్పటికే విడుదల చేశారు.
ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లలో డ్రోన్లు, ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు, భూసార పరీక్ష పరికరాలు, మినీ రైస్ మిల్లులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు వంటి అనేక ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. భూసార పరీక్షల ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని, డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ సులభంగా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. మినీ రైస్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్లతో రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రాసెస్ చేసి అమ్ముకునే అవకాశం పొందుతారు. ప్రతి ఎఫ్‌పీవోలో 1500 నుంచి 2000 మంది రైతులు సభ్యులుగా ఉండగా, మండలానికి ఒక ఎఫ్‌పీవో చొప్పున ఈ కేంద్రాలు పనిచేస్తాయి. అవసరమైన పరికరాలను మార్కెట్ కంటే తక్కువ ధరకు అద్దెకు ఇచ్చి, వచ్చిన ఆదాయాన్ని మళ్లీ కేంద్రాల నిర్వహణకే వినియోగిస్తారు. ఈ విధానం రైతులకు దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.