దుబాయ్ రియల్ ఎస్టేట్ సంక్షోభం! భారీగా తగ్గిన ఆస్తుల అమ్మకాలు, అద్దెలు..
Dubai House Rents Fall in 2026: యూఏఈలోని దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన ఇళ్ల అద్దెలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో అద్దెదారులకు కొంత ఊరట లభిస్తోంది. గతంలో ఇంటి యజమానులు నిర్ణయించిన అద్దెకు అంగీకరించాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు అద్దెదారులు తమకు అనుకూలమైన ధర కోసం చర్చించే అవకాశం పెరిగింది. తక్కువ అద్దెకు మెరుగైన సౌకర్యాలున్న ఇళ్లను పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పాత ఇళ్లలో అధిక అద్దె చెల్లిస్తూ కొనసాగడం కంటే, కొత్త ఇళ్లకు మారడానికే మొగ్గు చూపుతున్నారు. 2026 మూడో త్రైమాసికానికి సంబంధించి అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL విడుదల చేసిన నివేదికలో ఈ పరిణామాలు వెల్లడయ్యాయి.
దుబాయ్‌లో తగ్గుతున్న ఇళ్ల అద్దెలు.. అద్దెదారులకు మంచి అవకాశం! రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక మార్పులు..
దుబాయ్‌లో కొత్త ఇళ్ల సరఫరా పెరుగుతోంది.. తగ్గుతున్న అద్దెలతో మారుతున్న మార్కెట్..
దుబాయ్: యూఏఈలోని దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన ఇళ్ల అద్దెలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో అద్దెదారులకు కొంత ఊరట లభిస్తోంది. గతంలో ఇంటి యజమానులు నిర్ణయించిన అద్దెకు అంగీకరించాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు అద్దెదారులు తమకు అనుకూలమైన ధర కోసం చర్చించే అవకాశం పెరిగింది. తక్కువ అద్దెకు మెరుగైన సౌకర్యాలున్న ఇళ్లను పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పాత ఇళ్లలో అధిక అద్దె చెల్లిస్తూ కొనసాగడం కంటే, కొత్త ఇళ్లకు మారడానికే మొగ్గు చూపుతున్నారు. 2026 మూడో త్రైమాసికానికి సంబంధించి అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL విడుదల చేసిన నివేదికలో ఈ పరిణామాలు వెల్లడయ్యాయి.
అద్దె ఒప్పందాల్లో మారుతున్న పరిస్థితులు
దుబాయ్‌లో అద్దె మార్కెట్లో అద్దెదారుల ప్రాధాన్యం పెరుగుతోందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. 2026 మూడో త్రైమాసికంలో అద్దె ఒప్పందాల పునరుద్ధరణలు ఏడాది ప్రాతిపదికన 2.4 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 8.3 శాతం మాత్రమే పెరిగాయి. అదే సమయంలో కొత్త అద్దె ఒప్పందాల నమోదు గణనీయంగా పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే 48.6 శాతం, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.7 శాతం వృద్ధి నమోదైంది. పాఠశాలల కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో కుటుంబాలు నివాసాల కోసం వెతకడం కూడా కొత్త ఒప్పందాలు పెరగడానికి ఒక కారణంగా నిలిచింది. మొత్తంగా దుబాయ్‌లో అద్దె రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి.
సగటు అద్దెల్లో తగ్గుదల
దుబాయ్‌లో అద్దెల తగ్గుదల కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో సగటు నివాస గృహాల అద్దెలు 5.2 శాతం తగ్గాయి. ఇందులో అపార్ట్మెంట్ల అద్దెలు 5.3 శాతం పడిపోగా, విల్లాల అద్దెలు 3 శాతం తగ్గాయి. దీంతో అద్దెదారులు తమ బడ్జెట్‌కు సరిపోయే ఇళ్లను ఎంచుకునే అవకాశం పెరిగింది. ముఖ్యంగా మెరుగైన ప్రాంతాల్లో, ఎక్కువ సౌకర్యాలున్న ఇళ్లను గతంతో పోలిస్తే తక్కువ అద్దెకు పొందేందుకు అవకాశం ఏర్పడుతోంది.
రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు, అమ్మకాల్లో మందగమనం
మరోవైపు దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలు, అమ్మకాల మార్కెట్లోనూ కొంత మందగమనం కనిపిస్తోంది. గతంలో నమోదైన గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే ఆస్తుల లావాదేవీలు తగ్గాయి. మొత్తం ప్రాపర్టీ లావాదేవీలు ఏడాది ప్రాతిపదికన 37.7 శాతం పడిపోయాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇళ్ల విక్రయాలు (ఆఫ్ప్లాన్ సేల్స్) 41.8 శాతం తగ్గగా, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల పునర్విక్రయాలు (సెకండరీ మార్కెట్ సేల్స్) 24.9 శాతం తగ్గాయి.
అయితే త్రైమాసిక గణాంకాలను పరిశీలిస్తే కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మూడో త్రైమాసికంలో సెకండరీ మార్కెట్ లావాదేవీలు 19.8 శాతం పెరిగాయి. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విక్రయాలు 9.1 శాతం తగ్గాయి. పునర్విక్రయాల్లో వచ్చిన పెరుగుదల కారణంగా మొత్తం త్రైమాసిక విక్రయాల తగ్గుదల 2.2 శాతానికే పరిమితమైంది. అంటే మార్కెట్ పూర్తిగా నిలిచిపోకుండా, కొనుగోలుదారుల ఆసక్తి కొన్ని విభాగాల్లో కొనసాగుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
విల్లాల ధరలు పెరుగుదల.. అపార్ట్మెంట్ల ధరల్లో తగ్గుదల
ఇళ్ల ధరల్లోనూ విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన దుబాయ్‌లో విల్లాల ధరలు 2.2 శాతం పెరిగాయి. అయితే అపార్ట్మెంట్ల ధరలు మాత్రం 0.9 శాతం తగ్గాయి. రెండో త్రైమాసికంలో ఇళ్ల ధరల్లో 2 నుంచి 3 శాతం వరకు నమోదైన త్రైమాసిక తగ్గుదల, మూడో త్రైమాసికంలో 1.6 నుంచి 1.8 శాతానికి పరిమితమైంది. దీంతో ధరల పతనం వేగం కొంత తగ్గినట్లు తెలుస్తోంది.
దుబాయ్‌తో పాటు అబుధాబి రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ మందగమనం కనిపించింది. అక్కడ మొత్తం ప్రాపర్టీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 9.6 శాతం తగ్గాయి. ఈ ఏడాదిలో అబుధాబిలో వార్షిక ప్రాతిపదికన విక్రయాలు తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కొత్త నివాస ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభావం
దుబాయ్‌లో కొత్త నివాస యూనిట్ల సరఫరా మాత్రం కొనసాగుతోంది. 2026 మూడో త్రైమాసికంలో సుమారు 14,000 కొత్త నివాస యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలోని మొత్తం నివాస యూనిట్ల సంఖ్య సుమారు 9,23,700కు చేరింది. నాలుగో త్రైమాసికంలో మరో 17,000 యూనిట్లు పూర్తయ్యే అవకాశం ఉందని JLL అంచనా వేసింది.
అయితే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులు చాలావరకు నిర్ణీత గడువులోనే పూర్తవుతున్నప్పటికీ, ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టులకు ఆలస్యం జరుగుతోంది. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కొనుగోలు ప్రక్రియలో జాప్యం వంటి అంశాలు ఇందుకు కారణమవుతున్నాయని JLL నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన కొన్ని ప్రాజెక్టుల నిర్మాణ పనులు కూడా వాయిదా పడ్డాయి. దీంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని సంస్థ అభిప్రాయపడింది.
అదే సమయంలో ఆర్థికంగా బలమైన రియల్ ఎస్టేట్ సంస్థలు పెరుగుతున్న నిర్మాణ వ్యయాలను తట్టుకుని ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయగలవని JLL పరిశోధన విభాగం వెల్లడించింది. ఆర్థిక వనరులు, నిర్మాణ నిర్వహణ సామర్థ్యం ఉన్న డెవలపర్లకు ఈ పరిస్థితుల్లో ప్రయోజనం ఉండవచ్చని విశ్లేషించింది.
కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్త వ్యూహాలు
JLL మిడిలీస్ట్, ఆఫ్రికా పరిశోధన విభాగాధిపతి తైమూర్ ఖాన్ మాట్లాడుతూ.. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెవలపర్లు తమ ప్రాజెక్టుల రూపకల్పనలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ నాణ్యత, విస్తీర్ణం, అందించే సౌకర్యాలను కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్ల ధరలను మరింత తగ్గించే అవకాశాలు పరిమితంగా ఉన్నాయని వివరించారు. అయితే కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సౌకర్యవంతమైన చెల్లింపు పథకాలు, అనువైన ఆర్థిక వెసులుబాట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఒక మార్పు దశలో ఉంది. తగ్గుతున్న అద్దెలు అద్దెదారులకు కొత్త అవకాశాలను కల్పిస్తుండగా, ప్రాపర్టీ కొనుగోళ్లలో మందగమనం డెవలపర్ల వ్యూహాలను ప్రభావితం చేస్తోంది. కొత్త ఇళ్ల సరఫరా పెరుగుతున్నప్పటికీ నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల ఆలస్యం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అద్దెకు ఇల్లు వెతుకుతున్నవారు తమకు అనుకూలమైన ధర, మెరుగైన సౌకర్యాల కోసం చర్చించే అవకాశం పొందుతున్నారు. కొనుగోలు చేయాలనుకునేవారు మాత్రం ధరలు, ప్రాజెక్టుల నాణ్యత, నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.