విదేశాల్లోనూ గిరిజన సంస్కృతి.. సౌదీలో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్!
Janjatiya Gaurav Divas in Riyadh: గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని సౌదీ అరేబియాలో జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) సహకారంతో భారత రాయబార కార్యాలయం నిర్వహించింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఆదివాసీ ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నాయకుడి సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
సౌదీ అరేబియాలో ఘనంగా జనజాతీయ గౌరవ్ దివస్.. బిర్సా ముండా త్యాగాలను స్మరించుకున్న ప్రవాస భారతీయులు..
రియాద్‌లో భారతీయ ఆదివాసీల సందడి.. బిర్సా ముండా, కొమరం భీమ్‌కు ఘన నివాళులు..
రియాద్: గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని సౌదీ అరేబియాలో జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) సహకారంతో భారత రాయబార కార్యాలయం నిర్వహించింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఆదివాసీ ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నాయకుడి సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియాలో భారత రాయబారి విపుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలు చేసిన ఎందరో మహనీయులు ఉన్నారని, వారి సేవలను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాంటి గొప్ప నాయకుల్లో బిర్సా ముండా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, జాతీయ గౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని వివరించారు. బిర్సా ముండా జీవితం ధైర్యం, త్యాగం, సమాజం పట్ల అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందని రాయబారి పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ గిరిజన వీరుడు కొమరం భీమ్‌కు ప్రత్యేక నివాళులు అర్పించారు. ప్రవాస భారతీయుడు రామ్ రిలంగి కొమరం భీమ్‌పై ఆలపించిన ప్రత్యేక గీతం సభికులను ఆకట్టుకుంది. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస గిరిజన కళాకారులు సంప్రదాయ ధింసా నృత్యంతో పాటు ఇతర జానపద నృత్యాలను ప్రదర్శించారు. తమ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాకారులు చేసిన ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) ప్రధాన కార్యదర్శి నీలిమా నాయక్ మాట్లాడుతూ.. భారతీయ ప్రవాస సమాజంలో చాలామందికి జనజాతీయ గౌరవ్ దివస్ గురించి, బిర్సా ముండా చరిత్ర గురించి పూర్తిస్థాయిలో అవగాహన లేదని అన్నారు. గిరిజన నాయకుల పోరాటాలు, వారి త్యాగాలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వారు పోషించిన పాత్రను మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయులకు దేశ చరిత్రతో పాటు గిరిజన సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేయవచ్చని పేర్కొన్నారు.
తెలుగు ప్రవాస భారతీయుల సంస్థ సాటా (SATA) కూడా ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొంది. సంస్థ అధ్యక్షుడు మల్లేశన్ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో జన్మించి, అక్కడే గిరిజన హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా వంటి నాయకుల చరిత్రను గుర్తుచేసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. జార్ఖండ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజనులు ఉపాధి కోసం తెలంగాణ, కేరళ, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాలకు వలస వెళ్తున్నారని వివరించారు. అదే సమయంలో తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఈ వలసల నేపథ్యంలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను పరస్పరం పంచుకునే వేదికలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో GIO ప్రతినిధులు విశాల్, రమేష్, హర్షలా, షగుఫ్తా పాల్గొన్నారు. SATA తరఫున ముజమ్మిలుద్దీన్, నూరుద్దీన్, నరేష్ తదితరులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ ప్రవాసులు ఒకే వేదికపై కలుసుకుని బిర్సా ముండా, కొమరం భీమ్ వంటి గిరిజన నాయకుల సేవలను స్మరించుకోవడం ద్వారా భారతీయ సంస్కృతి, గిరిజన వారసత్వం పట్ల తమ అనుబంధాన్ని చాటుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తమ మూలాలను, చరిత్రను, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సందేశాన్ని ఈ వేడుకలు అందించాయి.
Tags
Be the first to react