మనందరికీ పాలు అంటే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం అన్న భావన ఉంటుంది. పిల్లలకైనా, పెద్దలకైనా రోజూ పాలు తాగడం అలవాటే. కానీ, తాజా అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే — అతిగా చిక్కగా ఉన్న గేదె పాలు లేదా లోకల్‌గా తయారుచేసే "బఫెలో మిల్క్" ఆరోగ్యానికి హానికరం కావొచ్చు. మనం టీ, కాఫీ, పెరుగు, నెయ్యి ఇలా పాలను విస్తృతంగా వాడుతాం. కానీ ఆ పాలు ఎంత చిక్కగా ఉన్నాయో, అందులో కొవ్వు శాతం ఎంతుందో గమనించకపోవడం వల్లనే హార్ట్ ఎటాక్, హైబీపీ వంటి సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజాగా “బఫెలో మిల్క్” అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన కొన్ని లోకల్ బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రజలు వీటిని ఇష్టపడటానికి కారణం — పాలు చిక్కగా ఉండటం. కానీ ఈ ప్యాకెట్లపై ఎలాంటి సమాచారం, FSSAI లోగో లేదా కొవ్వు శాతం వివరాలు ఉండవు. కంపెనీలు ఉత్పత్తి చేసే బ్రాండెడ్ పాలు మాత్రం కొవ్వు, SNF స్థాయిలు స్పష్టంగా చూపిస్తాయి. కానీ ఈ లోకల్ ప్యాకెట్లు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
డాక్టర్ల ప్రకారం, ఈ చిక్కటి పాలల్లో అధిక సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని పెంచుతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణను అడ్డుకుంటుంది. ఫలితంగా హైబీపీ, హార్ట్ ఎటాక్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శారీరక శ్రమ తక్కువగా చేసే వ్యక్తులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతారు.
ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) లోనూ ఇదే విషయాన్ని నిర్ధారించారు — అధిక కొవ్వు ఉన్న పాలను తరచుగా తాగే వారిలో హైబీపీ వచ్చే ప్రమాదం 80% ఎక్కువగా ఉంటుందని తెలిపారు. డైటీషియన్లు చెబుతున్నట్లు రోజుకు అర లీటర్ కంటే ఎక్కువ పాలు తాగకూడదు మరియు వీలైనంతవరకు బ్రాండెడ్ కంపెనీ పాలు మాత్రమే వాడాలి. అవి కొవ్వు నియంత్రిత స్థాయిలో ఉంచి ఉత్పత్తి చేస్తాయి.
తరతరాలుగా మన పెద్దవారు గేదె పాలు తాగేవారు కానీ వారు కష్టపడి పని చేయడం వల్ల కొవ్వు కరిగిపోయేది. కానీ నేటి జీవితంలో టెక్నాలజీ ఆధారంగా కదలికలు తగ్గడంతో కొవ్వు కరగడం లేదు. అందుకే మనం తీసుకునే ఆహారంలో, ముఖ్యంగా పాలలో కూడా కొవ్వు పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.