ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తెచ్చిన అద్భుత పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ యోజన) ముందువరుసలో ఉంటుంది. ఈ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం రూ. 6 వేలు వస్తాయి.
దీనిని ఒకేసారి కాకుండా, నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో అందిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) కింద ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే జమ చేస్తారు. ఇప్పటివరకు 20 విడతల్లో డబ్బులు అందగా, చివరిసారిగా ఆగస్ట్ 2న 20వ విడత డబ్బుల్ని విడుదల చేశారు. ఇప్పుడు రైతులు 21వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.
దీపావళి సందర్భంగా వస్తాయని భావించినా ఆలస్యం అయింది, అయితే ఈ నవంబరులోనే ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20వ విడత కింద 9.7 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి.
పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు కచ్చితంగా ఇ-కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ఇ-కేవైసీని పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో (pmkisan.gov.in) లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో లేదా పీఎం కిసాన్ అధికారిక యాప్‌లో చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కోసం ఆధార్ నంబర్ కచ్చితంగా అవసరం పడుతుంది.
ఇక్కడ కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి: 2019, ఫిబ్రవరి 1 తర్వాత భూమి యాజమాన్య హక్కులు పొందిన వారు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు. అలాగే, ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు (భార్యాభర్తలు లేదా తండ్రీ కొడుకు వంటివారు) ఉన్నా, ఒక్కరికి మాత్రమే డబ్బులు అందుతాయి.
లబ్ధిదారులు తమ స్టేటస్‌ను పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో (pmkisan.gov.in) చెక్ చేసుకోవచ్చు. హోం పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' లోకి వెళ్లి, 'నో యువర్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా, 'బెనిఫిషియరీ లిస్ట్' లోకి వెళ్లి, రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంటర్ చేసి 'గెట్ రిపోర్ట్' పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.