ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న స్పైస్‌జెట్ విమానానికి పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆదివారం రాత్రి ముంబై నుండి బయలుదేరిన స్పైస్‌జెట్ ఎస్‌జీ-670 విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం కోల్‌కతా విమానాశ్రయానికి సమీపంలో ఉండగా పైలట్లు ఆ లోపాన్ని గమనించి వెంటనే అత్యవసర చర్యలు చేపట్టారు. అయితే సమయోచితంగా స్పందించడం వల్ల ప్రమాదం తప్పి, అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కి సిద్ధమవుతుండగా ఇంజిన్ ఫెయిల్ అయినట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఏటీసీ స్పందించి రన్‌వేను ఖాళీ చేయడంతో పాటు, అగ్నిమాపక దళాలు మరియు సహాయక బృందాలను అప్రమత్తం చేసింది.
రాత్రి 11:38 గంటలకు విమానం ఎలాంటి అపాయం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయింది. వెంటనే ఫుల్ ఎమర్జెన్సీని అధికారికంగా ఉపసంహరించుకున్నారు. ప్రయాణికులందరినీ ప్రశాంతంగా విమానం నుంచి దించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి హానీ జరగకపోవడం అదృష్టమని అధికారులు పేర్కొన్నారు.
స్పైస్‌జెట్ ప్రతినిధి ఈ ఉదయం ప్రకటన చేస్తూ, “కోల్‌కతా ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం నిజమే. అయితే పైలట్లు సమయానికి స్పందించడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కిందకు దిగారు. ప్రస్తుతం విమానాన్ని మా ఇంజినీరింగ్ బృందాలు పరిశీలిస్తున్నాయి” అని తెలిపారు. ఈ సంఘటనతో విమాన సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.