తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న బాంబు బెదిరింపులు మరోసారి కలకలం సృష్టించాయి. తాజాగా ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చెన్నైలోని ఆళ్వార్‌పేట్‌లో ఉన్న ఆమె ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపాడు.
దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ బెదిరింపు మెయిల్ అందిన వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు త్రిష నివాసానికి చేరుకున్నారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గంటల తరబడి జరిపిన సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనేనని నిర్ధారించారు. వచ్చిన బెదిరింపు బూటకమని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలోనూ త్రిష నివాసానికి మూడుసార్లు ఇలాంటి బెదిరింపులు రాగా, ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఈ ఘటనపై తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపు మెయిల్ పంపిన ఆగంతుకుడిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల కాలంలో చెన్నైలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు ఇలాంటి ఫేక్ బాంబు బెదిరింపులు తరచూ వస్తున్న విషయం తెలిసిందే.