విద్యా రంగాన్ని ఆధునికీకరించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్‌రూములు, ఇంగ్లిష్ మీడియం బోధన, టీచర్లకు అధునాతన శిక్షణ వంటి చర్యలు వేగంగా అమలు చేయబడుతున్నాయి. విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ అవగాహన పెంచడం, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా పాఠశాల వాతావరణం సృష్టించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ప్రతి విద్యార్థి భవిష్యత్తు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా మారాలనే దృక్పథంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
విద్యా రంగం మరో మైలురాయిని చేరనుంది ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం లీప్(LEAP – Learning Excellence in Andhra Pradesh) ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రు జడ్‌పీ ఉన్నత పాఠశాల (ZPHS Nidamarru)లో పైలట్ స్కూల్ నిర్మాణం వేగంగా సాగుతోంది.
ఈ పాఠశాల రూపకల్పన పూర్తిగా ఆధునికంగా విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతుండగా, దాదాపు రూ.14 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఉన్న జీ+1 భవనంపై మరో అంతస్తు కట్టబడుతోంది. కొత్త అంతస్తులో ఇండోర్ స్టేడియం, యాంఫీ థియేటర్, డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్కూల్ ప్రాంగణంలో రన్నింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, గార్డెన్, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ లీప్ ప్రాజెక్ట్‌కు రూపం దిద్దుకుంది. ఆయన ప్రకారంఈ పాఠశాలలు భవిష్యత్ తరానికి కావాల్సిన నైపుణ్యాలు సృజనాత్మక ఆలోచనలు, డిజిటల్ లిటరసీ వంటి అంశాలను నేర్పించే కేంద్రాలుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో విద్యా నాణ్యత ప్రపంచ స్థాయికి చేరుకోవాలి. రాబోయే ఐదేళ్లలో ప్రపంచం మొత్తం ఏపీ మోడల్ వైపు చూడాలి అని మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు.
నిడమర్రు పాఠశాల ప్రత్యేకత దాని డిజైన్‌లో ఉంది. ‘యూ’ ఆకారంలో రూపొందించిన ఈ భవనంలో ప్రాథమికం నుంచి ప్రాథమికోన్నత స్థాయి వరకు విద్య అందించనున్నారు. ప్రతి తరగతి గదిలో స్మార్ట్ బోర్డులు, ఆడియో-విజువల్ పరికరాలు, ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్స్ ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి వేర్వేరు జోన్‌లు ఏర్పాటు చేయబడతాయి.
ఇదిలా ఉండగా, టీచర్లకు సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘లీప్ యాప్’ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో టీచర్లు హాజరు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల వివరాలు మొదలైన వాటిని ఒకేచోట నమోదు చేయవచ్చు. ఫేస్ రికగ్నిషన్ లాగిన్ వ్యవస్థతో ఈ యాప్ మరింత సురక్షితంగా మారింది.
నిడమర్రు పాఠశాల నిర్మాణం పూర్తయితే, అది ఏపీలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఒక మోడల్‌గా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ లీప్ స్కూళ్లు భవిష్యత్‌లో కార్పొరేట్ స్కూళ్లకంటే మెరుగైన మౌలిక వసతులతో, నాణ్యమైన విద్యా పద్ధతులతో ముందుకు సాగనున్నాయి.
విద్యారంగంలో ఇలాంటి విప్లవాత్మక మార్పులు రావడంతో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పిల్లలు ప్రపంచ స్థాయి విద్యను స్వదేశంలోనే పొందే అవకాశం కలుగుతోంది. ఈ కొత్త ఆలోచన ఏపీ విద్యా వ్యవస్థను కొత్త దిశగా నడిపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..