దోసెలు (Dosalu) అంటే మనకు ఎప్పుడూ ఇష్టమే కదా… ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, సాయంత్రం స్నాక్‌గా కానీ దోసె ఉంటే లాగించేస్తాం. వీటిని కొబ్బరి, పల్లీ లేదా టమాటా చట్నీతో (Tomato chutney) కలిపి తింటే ఆ రుచే వేరు.
సాధారణంగా దోసె చేయాలంటే పప్పులు నానబెట్టి, పిండి రుబ్బి, పులియబెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా టైమ్ తీసుకుంటుంది. కానీ, కొత్తగా మరియు ఎంతో టేస్టీగా, నిమిషాల్లోనే అయిపోయే ఒక డిఫరెంట్ దోసె రెసిపీని ఇప్పుడు చూద్దాం. అదే ‘పచ్చికొబ్బరి దోసె’..
ఇది ఇంట్లో చేసి పెడితే, ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా, ఈ రెసిపీ మరియు దానికి పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే పల్లీ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం…
పచ్చికొబ్బరి దోసె తయారీ విధానం (Coconut Dosa Recipe)
ఈ దోసెలు చేయడానికి ఎక్కువ వస్తువులు అవసరం లేదు.
కావాల్సిన పదార్థాలు (Ingredients):
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - 1 కప్పు
పచ్చికొబ్బరి ముక్కలు - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వంటసోడా (Baking Soda) - 1 టీ స్పూన్
ఆయిల్ - సరిపడా
తయారీ పద్ధతి (Preparation Method):
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుని, అందులో ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఆ తర్వాత గిన్నెపై మూతపెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
అరగంట తర్వాత, ఈ నానిన రవ్వను మిక్సీ జార్‌లోకి వేయండి. అందులో ఒక కప్పు పచ్చికొబ్బరి ముక్కలు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండి చాలా మెత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలో వేసి, దోసె పిండికి సరిపడా నీళ్లు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. చివరగా ఒక టీ స్పూన్ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసె పాన్‌పై పావు స్పూన్ ఆయిల్ వేయాలి. పిండిని గరిటెతో తీసుకొని, పూరీ ఆకారంలో దోసె వేసి, దానిపై మూతపెట్టాలి. దోసె కాలిన తర్వాత ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడి కొబ్బరి దోసెలు రెడీ అయినట్లే!
నోరూరించే పల్లీ చట్నీ తయారీ (Peanut Chutney Recipe)
కొబ్బరి దోసెలకు పల్లీ చట్నీ పర్‌ఫెక్ట్ కాంబినేషన్… దీన్ని కూడా నిమిషాల్లోనే చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు (Ingredients):
ఆయిల్ - 1 స్పూన్
పచ్చిమిర్చి - 5
పల్లీలు (వేరుశనగలు) - 1 కప్పు
అల్లం ముక్కలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర - అర స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు - 20 గ్రాములు
తయారీ పద్ధతి (Preparation Method):
ముందుగా ఒక గిన్నెలో 20 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి నానబెట్టాలి.
మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోయాలి. ఇందులో ఐదు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేగనివ్వాలి.
ఇందులోనే రెండు అల్లం ముక్కలు, ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అలాగే అర స్పూన్ జీలకర్ర వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లోకి వేయాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు మరియు సరిపడా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి.
అంతే.. నోరూరించే పల్లీ చట్నీ సిద్ధంగా ఉంటుంది. కొబ్బరి దోసెల్లో ఈ పల్లీ చట్నీ వేసి తిన్నారంటే, మీరే ఆహా అనాల్సిందే…