భారతదేశంలో ప్రభుత్వ రంగ బీమా కంపెనీలలో ముందు వరుసలో ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త పాలసీని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ఇన్సూరెన్స్‌తో పాటు సేవింగ్స్ ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది.
ఇది మార్కెట్ ఒడుదొడుకులతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే, కంపెనీ లాభాల్లో భాగస్వామ్యం ఉండదు, కాబట్టి బోనస్ చెల్లింపులు ఉండవు. అయితే, ఈ ప్లాన్‌లోనే గ్యారెంటీడ్ అడిషన్ ఉంటుంది. ఈ బేస్ ప్లాన్ ద్వారానే ఒకేసారి రూ. 8 లక్షల వరకు అందుకునే అవకాశం లభిస్తోంది.
ఈ పాలసీని మహిళలు సులభంగా తీసుకునేలా ఎల్‌ఐసీ డిజైన్ చేసింది. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వరకు వయసు ఉన్న మహిళలు ఈ ప్లాన్ కొనుగోలు చేయడానికి అర్హులు. ఈ పాలసీ మెచ్యూరిటీ టర్మ్ 25 సంవత్సరాలుగా ఉంటుంది. ప్రీమియం చెల్లింపు వ్యవధిని పాలసీదారులు ఎంచుకోవచ్చు. ఇది 7 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది.
కనీస బీమా హామీ మొత్తం రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ పరిమితి ఏదీ లేదు. జీతం పొందే మహిళలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు తమ ఆదాయానికి అనుగుణంగా ప్రీమియం టర్మ్ ఎంచుకోవచ్చు.
ఈ పాలసీలో ముఖ్యంగా గ్యారెంటీడ్ అడిషన్ అనేది పెద్ద ప్రయోజనం. పాలసీదారు చెల్లించిన ప్రీమియంపై 7 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్‌ను జమ చేస్తారు. దీనిని పాలసీ పూర్తి వ్యవధిలో లెక్కిస్తారు.
పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత, బీమా హామీ మొత్తం మరియు ఈ గ్యారెంటీడ్ అడిషన్ కలిపి పాలసీదారుకు చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తూ మరణిస్తే, నామినీకి వార్షిక ప్రీమియానికి 10 రెట్లు లేదా ఇన్సూరెన్స్ సమ్ అష్యూర్డ్ మొత్తంలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు.
ఈ పాలసీలో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన విషయం ఏంటంటే, అవసరాలకు అనుగుణంగా సమ్ అష్యూర్డ్‌ను విడతల వారీగా తీసుకునేందుకు మూడు ఆప్షన్లు ఇచ్చారు. పాలసీ కొనుగోలు సమయంలోనే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
పాలసీ ప్రీమియం చెల్లింపు టెన్యూర్ పూర్తయిన తర్వాత హామీ మొత్తంలో 50 శాతం ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సమ్ అష్యూర్డ్ మొత్తంలో 7.5 శాతం చొప్పున 12 సార్లు తీసుకోవచ్చు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి హామీ మొత్తంలో 15 శాతం వెనక్కి తీసుకోవచ్చు. ఇలా 6 సార్లు వెనక్కి ఇస్తారు.
ప్రీమియం చెల్లింపులను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లించే ఆప్షన్లు కూడా ఉన్నాయి. 35 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ ఈ పాలసీని తీసుకుంటే, మరియు ప్రీమియం చెల్లింపు టర్మ్ 10 ఏళ్లుగా, బేస్ ప్లాన్ తీసుకుంటే..
రోజుకు సుమారు రూ. 125 ప్రీమియం పడుతుంది. చెల్లించిన ప్రీమియం మొత్తం రూ. 4.49 లక్షల వరకు అవుతుంది. ఆప్షన్ B ఎంచుకున్నట్లయితే, గ్యారంటీడ్ అడిషన్ రూ. 6.44 లక్షల వరకు జమ అవుతుంది. ప్రతి రెండేళ్లకోసారి రూ. 15 వేలు వెనక్కి ఇస్తారు. ఇలా 12 సార్లు తీసుకుంటే మొత్తం రూ. 1,80,000 వస్తాయి.
ఇక మెచ్యూరిటీ బెనిఫిట్ మరియు గ్యారంటీడ్ అడిషన్ కలిపి రూ. 8.44 లక్షల వరకు వస్తాయి. మహిళలు తమ భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడానికి మరియు ఆర్థిక భద్రత పొందడానికి ఈ ఎల్‌ఐసీ ప్లాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.