ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయంలో మత్స్యకారులకు సంప్రదాయ వలలను పంపిణీ చేస్తూ మంత్రి కీలక ప్రకటనలు చేశారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని సదుపాయాలను అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎఫ్‌డీవో రవికుమార్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక్కో యూనిట్ సంప్రదాయ వలల విలువ రూ.2,43,700గా ఉందని తెలిపారు. మొత్తం ఏడుగురు మత్స్యకారులకు ఈ వలలను అందజేశామని, దీని ద్వారా వారి వేట సామర్థ్యం పెరిగి ఆదాయం మెరుగవుతుందని పేర్కొన్నారు. కేవలం వలల పంపిణీతోనే కాకుండా, త్వరలోనే మత్స్యకారులకు ఇంజిన్‌తో కూడిన ఆధునిక బోట్లను కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో బోటు ధర సుమారు రూ.52 లక్షల వరకు ఉంటుందని, ఇవి చేపల వేటను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలకంగా నిలుస్తాయని చెప్పారు. ప్రభుత్వ సబ్సిడీతో యంత్రాలు, పరికరాలు అందిస్తూ మత్స్యకారులకు అండగా నిలుస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. గతంలో మత్స్యకార కుటుంబాలకు రూ.4,500 ఆర్థిక సహాయం అందించామని, ప్రస్తుతం నేరుగా వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.20 వేల వరకు సహాయం ఇస్తున్నామని చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్ సదుపాయం కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మత్స్యకారుల రవాణా అవసరాల కోసం 40 శాతం సబ్సిడీతో ఆటోలు అందించే ప్రణాళికను త్వరలో అమలు చేస్తామని వెల్లడించారు. ఉదాహరణకు ఆటో ధర రూ.2 లక్షలు అయితే, దాదాపు రూ.80 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న పీఎంఎంఎస్‌వై (PMMSY) పథకం కింద కూడా మత్స్యకారులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ఇంజిన్లు, తెప్పలు, వలలు, పడవలు రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఓబీసీలకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం వరకు సబ్సిడీ అందిస్తామని తెలిపారు. అయితే రాయితీ పొందాలంటే సొంత బోటు, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తప్పనిసరి అని, మిగిలిన మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. మత్స్య సంపద ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, రాష్ట్రంలో మత్స్య రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి.