గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ గోంగూర పచ్చడి కలిపి తింటే ఆ తృప్తే వేరు. పక్కా కొలతలతో, సరైన పద్ధతిలో చేస్తే ఈ పచ్చడి పుల్ల పుల్లగా తింటూ ఉంటే కమ్మదనంగా ఉంటుంది. తాజాగా, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడిని ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారు చేసే చిట్కాలు తయారీ విధానం తెలుసుకుంటున్న మరి.
పచ్చడి రుచిగా రావాలంటే ముందుగా మనం ఎంచుకునే గోంగూర ఆకు నాణ్యమైనదై ఉండాలి. మార్కెట్‌లో లభించే తెల్ల గోంగూర కంటే, 'ఎర్ర గోంగూర' పచ్చడికి అత్యంత అనువైనది. దీనిలో ఉండే సహజసిద్ధమైన పులుపు పచ్చడికి అసలైన రుచిని ఇస్తుంది. సుమారు అరకేజీ ఆకులను శుభ్రంగా కడిగి, తేమ అనేది అస్సలు లేకుండా కాటన్ క్లాత్‌పై కనీసం ఐదు గంటల పాటు ఆరబెట్టాలి. ఆకులో తడి ఏమాత్రం ఉండకూడదు.
పచ్చడికి కమ్మని వాసన రావాలంటే ఇంట్లోనే తాజాగా మసాలా సిద్ధం చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నూనెలో మెంతులు, ధనియాలు మరియు 100 గ్రాముల ఎండుమిరపకాయలను దోరగా వేయించాలి. వీటిని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద వేయించి చల్లార్చుకోవాలి. వీటితో పాటు డ్రై రోస్ట్ చేసిన ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి మరియు తగినంత కల్లుప్పు కలిపి మిక్సీ పడితే పచ్చడికి కావలసిన ఘాటైన మసాలా పొడి సిద్ధమవుతుంది.
ఆరబెట్టిన గోంగూర ఆకులను తగినంత నూనెలో వేసి స్లోగా కలుపుతూ ఉడికించాలి. ఆకు మొత్తం ముద్దగా అయ్యే వరకు పప్పుగుత్తితో లేదా మాషర్‌తో మెదుపుతూ ఉడికిస్తే జిగురు తగ్గుతుంది. చివరలో ఒక టేబుల్ స్పూన్ నూనె అదనంగా చేర్చి మరో రెండు నిమిషాలు వేయించడం వల్ల పచ్చడికి మంచి నిగారింపు వస్తుంది. ఈ పద్ధతిలో ఉడికించిన గోంగూరను వేరుగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు.
పల్లీ నూనె లేదా నువ్వుల నూనె వాడటం అత్యుత్తమం. సుమారు 200 గ్రాముల నూనెను వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ మరియు వెల్లుల్లి రెబ్బలతో పోపు పెట్టుకోవాలి. ఈ పోపులో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి అవి క్రిస్పీగా మారిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న గోంగూర ముద్దను వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా నూనెలో వేయించడం వల్ల ఆకులో ఏవైనా తడి తేమ ఉంటే ఇగిరిపోతాయి, ఫలితంగా పచ్చడి పాడవదు.
చివరిగా పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని, చిటికెడు పసుపును అందులో కలిపి బాగా కలపాలి. ఇలా తయారైన పచ్చడిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఏడాది పొడవునా తాజాగా ఉంటుంది. మీరు కూడా ఈ కొలతలతో ప్రయత్నిస్తే, ప్రతిసారీ అదే కమ్మని రుచిని ఆస్వాదించవచ్చు.