మధుమేహంతో బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజూ తీసుకునే ప్రధాన ఆహారాలు అయిన అన్నం, చపాతీ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ డాక్టర్ దీప్తి కరేటి ఈ రెండు ఆహారాలపై కీలక విషయాలు వెల్లడించారు. అన్నం, చపాతీ రెండూ పోషక విలువలతో కూడినవేనని, కానీ వాటిని తీసుకునే మోతాదు, సమయం, కలిపే ఆహారాలపై ఆధారపడి మధుమేహ రోగులకు ప్రయోజనం లేదా నష్టం జరుగుతుందని ఆమె వివరించారు.
డాక్టర్ దీప్తి కరేటి వివరాల ప్రకారం, ఒక కప్పు ఉడికించిన అన్నంలో సుమారు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలిష్ చేసిన తెల్ల బియ్యంతో తయారైన అన్నం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటంతో మధుమేహ రోగులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అయితే బ్రౌన్ రైస్ లేదా హాఫ్ బాయిల్డ్ రైస్ వంటివి కొంత మెరుగైన ఎంపికలుగా ఉంటాయని తెలిపారు.
మరోవైపు, గోధుమ పిండితో తయారైన చపాతీ మధుమేహ రోగులకు కొంత మేలు చేసే ఆహారంగా డాక్టర్ పేర్కొన్నారు. ఒక చపాతీలో సుమారు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉండగా, దాదాపు 2 గ్రాముల వరకు ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. ఒక చపాతీలో సగటున 71 కేలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాముల కొవ్వు ఉండటం వల్ల ఇది సమతుల్య ఆహారంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
అయితే అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, చపాతీ మాత్రమే తినాల్సిందే అన్న నియమం కూడా లేదని డాక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా మధుమేహ రోగులు అన్నం తీసుకుంటే మోతాదు తగ్గించాలి, ఎక్కువగా కూరగాయలు, పప్పులు, ప్రోటీన్ ఆహారాలతో కలిపి తినాలని సూచించారు. చపాతీ అయినా, అన్నం అయినా అధికంగా తీసుకుంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. చివరగా, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి డైట్ ప్లాన్‌ను రూపొందించుకోవడం అత్యంత అవసరమని, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని డాక్టర్ దీప్తి కరేటి సూచించారు.