సీజనల్‌గా వచ్చే కూరగాయల్లో నాటు చిక్కుళ్లు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ నాటు చిక్కుడు పచ్చడిని ఇలా చేసుకుని చూడండి, మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది. ఒకప్పుడు అమ్మమ్మ చేతి వంటలో కనిపించే ఆత్మీయత, సహజమైన రుచి ఇప్పుడు అరుదైపోయింది. ఆధునిక జీవనశైలిలో నేటి యువత ఎక్కువగా ఇన్‌స్టెంట్ ఫుడ్‌కే పరిమితమవుతోంది. అయితే గ్రామీణ వంటకాలలో దాగి ఉన్న అసలైన రుచిని ఒక్కసారి ఆస్వాదిస్తే మాత్రం మళ్లీ మళ్లీ అదే కావాలనిపిస్తుంది. అలాంటి వంటకాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అమ్మమ్మ స్టైల్ నాటు చిక్కుడు పచ్చడి. సాదాసీదాగా కనిపించినా, ఇందులోని రుచి మాత్రం నిజంగా అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఒక్క ముద్ద కలిపితే చాలు, ఇంకేమీ కూర లేకపోయినా సరే భోజనం పూర్తయినంత సంతృప్తి కలుగుతుంది.
.
చిక్కుడు కాయ కూర చేసేటప్పుడు మధ్యలో వచ్చే గింజలను చాలామంది పక్కన పెట్టేస్తారు. కానీ నాటు చిక్కుడు కాయల్లో ఆ గింజలే అసలైన ప్రత్యేకత. అవి కొంచెం గట్టిగా, కొంచెం కరకరలాడుతూ నోట్లో పడితే వచ్చే ఫీలింగ్ వేరు. అలాంటి చిక్కుడు కాయలు దొరికినప్పుడు వాటితో నిల్వ పచ్చడి చేస్తే చాలా రోజుల పాటు ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి, కర్రీ వండడానికి టైం లేనప్పుడు ఈ పచ్చడి నిజంగా వరంలా ఉంటుంది.
ఈ పచ్చడి తయారీ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ముందుగా చిక్కుడు కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత నువ్వుల నూనెలో మెల్లగా వేయించాలి. మంట ఎక్కువగా ఉంటే కాయలు చిట్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేయించాలి. వేయించినప్పుడు చిక్కుడు కాయల్లోని గింజలు కాస్త కరకరలాడుతూ మంచి వాసన వస్తుంది. అదే ఈ పచ్చడికి ప్రాణం.
తర్వాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుండ్లు వేసి చక్కగా పోపు వేయాలి. వెల్లుల్లి పాయలు, కరివేపాకు వేసిన వెంటనే వంటగదంతా సువాసనతో నిండిపోతుంది. చివరగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేస్తే పోపు సిద్ధం. ఇక పచ్చడి తయారీకి పెద్దగా కష్టమేమీ లేదు. వేయించిన చిక్కుడు కాయల్లోకి ఈ పోపు, చింతపండు పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి వేసి చేత్తోనే బాగా కలపాలి. మిక్సీ అవసరం లేకుండా చేత్తో కలిపితేనే అసలైన అమ్మమ్మ రుచి వస్తుందని పెద్దలు చెబుతారు.
ఈ పచ్చడిని వేడి అన్నంతో కలిపి తింటే నోట్లో పండుగే. గింజలు పంటికి తగులుతూ, చింతపండు పులుపు, వెల్లుల్లి వాసన, నువ్వుల నూనె రుచి కలిసి ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. పప్పు, కూర ఏమీ లేకపోయినా ఈ పచ్చడి ఒక్కటే చాలు అనిపిస్తుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కొన్ని రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ నాటు చిక్కుడు పచ్చడి, మన సంప్రదాయ వంటకాల విలువను మరోసారి గుర్తు చేస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా నాటు చిక్కుడు కాయలు దొరికితే తప్పకుండా ఈ పచ్చడి చేసి చూడండి. అమ్మమ్మ చేతి రుచి ఏమిటో మీకే అర్థమవుతుంది.