అమ్మమ్మ, నానమ్మల కాలం నుంచి తరతరాలుగా కొనసాగుతున్న సంక్రాంతి సంప్రదాయాల్లో అరిసెలు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. పంట పండిన ఆనందాన్ని పంచుకునే ఈ పండుగ రోజున ప్రతి ఇంట్లో అరిసెలు వండటం ఆనవాయితీగా మారింది. బియ్యాన్ని నానబెట్టి, ఆరబెట్టి, పిండిగా మార్చి బెల్లం పాకంలో కలిపి నెయ్యి వాసనతో అరిసెలు వండే ఆ ప్రక్రియలోనే పండుగ వాతావరణం పరిమళిస్తుంది.
అయితే అరిసెలు వండిన తర్వాత చివరికి మిగిలే పిండితో చేసే మరో వంటకం ఉంది. అదే ‘ఉక్కిరి’ లేదా ‘ఉత్తిరి’.ఉక్కిరి అనేది ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి వంటకాలలోని మరిచిపోయిన మధుర జ్ఞాపకం. అరిసెల పిండిలో , నువ్వులు, కొద్దిగా నెయ్యి కలిపి నిదానంగా ఉడికించి చేసే ఈ వంటకం, రుచి పరంగా అరిసెలకు ఏమాత్రం తీసిపోదు. ముఖ్యంగా పెద్దల కాలంలో ఉక్కిరి అంటే కేవలం వంటకం మాత్రమే కాదు, పండుగ ముగిసిన తర్వాత కూడా ఆ ఆనందాన్ని నిలిపే ఒక సంప్రదాయంగా భావించేవారు.
అరిసెలు కన్నా చాలామంది ఉక్కిరిని ఇష్టపడుతూ ఉంటారు అయితే ఉక్కిరిని ఐదు రోజుల వరకు ఎటువంటి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తినవచ్చు. ఉక్కిరిని వేడివేడిది కన్నా ఉదయాన్నే తింటే దాని టేస్ట్ అమోఘం అని చెప్పుకోవాలి గ్రామాల్లో సంక్రాంతి రోజున ఉదయం నుంచి అరిసెల వాసనతో పాటు ఉక్కిరి చేసే సమయంలో వచ్చే తియ్యటి వాసన కూడా ఇళ్లంతా నింపేది.
పిల్లలు ఉక్కిరి కోసం ప్రత్యేకంగా ఎదురు చూసేవారు. ఎందుకంటే అది ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ప్రత్యేక వంటకం. నేటి తరం ఫాస్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, ఉక్కిరి వంటి సంప్రదాయ వంటకాలు మన సంస్కృతిని గుర్తు చేస్తాయి. సంక్రాంతి అంటే కేవలం పండుగే కాదు, మన వంటింటి సంప్రదాయాల పునరావృతం కూడా. ఉక్కిరి ఆ జ్ఞాపకాలకు మధురమైన ప్రతీకగా నిలుస్తోంది.