కొత్త సంవత్సరం అంటే ఉత్సాహం ఆనందం కుటుంబాలు స్నేహితులతో గడిపే ప్రత్యేక క్షణాలు అలాంటి వేళ ఇంటికి అతిథులు అకస్మాత్తుగా వచ్చేస్తే, బయట నుంచి ఆర్డర్ చేసిన ఆహారం ఆలస్యం అయితే, వంటగదిలో ఏం చేయాలా అనే టెన్షన్ సహజం. అయితే పండగ ఆనందాన్ని పాడు చేసుకునే అవసరం లేదు. కేవలం పది నిమిషాల లోపే సిద్ధమయ్యే కొన్ని చిట్కా స్నాక్స్ ఉంటే చాలు, మీ టేబుల్ నిండుగా కనిపిస్తుంది పెద్ద పెద్ద రెసిపీలు కాదు, రోజూ ఇంట్లో దొరికే పదార్థాలతోనే చేసే ఈ సులభమైన వంటకాలు కొత్త సంవత్సర వేడుకలకు ప్రత్యేక రుచిని జోడిస్తాయి.
నాచోస్ మీద కొద్దిగా కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లి, చీజ్ వేసి వేడి చేస్తే చాలు. వేడి వేడిగా సర్వ్ చేస్తే కరకరలాడే రుచి నిమిషాల్లోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే చీజ్ ఇష్టపడేవాళ్లకు పన్నీర్ పాప్‌కార్న్ మంచి ఎంపిక. చిన్న చిన్న పన్నీర్ ముక్కలను తేలికగా వేయించి, చీజ్ పొడి, కొద్దిగా మసాలా కలిపితే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నచ్చే స్నాక్ సిద్ధమవుతుంది.
పార్టీ టేబుల్ మీద చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉండాలంటే కార్న్, చీజ్‌తో చేసే చిన్న షాట్స్ బాగా పనికొస్తాయి. వెన్నతో వేయించిన మొక్కజొన్న, కరిగిన చీజ్, కాస్త నిమ్మరసం కలిస్తే ఒక్క స్పూన్‌లోనే పూర్తి రుచి అనుభూతి లభిస్తుంది. అదే విధంగా మినీ పిజ్జా బైట్స్ కూడా తక్కువ సమయంలో తయారవుతాయి. బ్రెడ్ ముక్కలపై సాస్, కూరగాయలు, చీజ్ వేసి కొద్దిసేపు వేడి చేస్తే చిన్న చిన్న పిజ్జాలు రెడీ. ఇవి ప్లేట్‌లో పెట్టగానే పార్టీ ఫీల్ తెస్తాయి.
మనకు అలవాటైన ఆలూ చాట్ కూడా చివరి నిమిషాల్లో తయారయ్యే బెస్ట్ ఐటెమ్. వేయించిన బంగాళదుంప ముక్కలకు చాట్ మసాలా, చింతపండు చట్నీ, నిమ్మరసం కలిపితే చాలు. కొద్దిగా దానిమ్మ గింజలు వేస్తే రంగు, రుచి రెండూ పెరుగుతాయి. అంతేకాదు, కరకరలాడే పాపడ్లతో చేసే రోల్స్ కూడా వేగంగా అయ్యే స్నాక్. ఉల్లిపాయ, టమాట మిశ్రమాన్ని పాపడ్‌పై పూసి రోల్ చేస్తే చూడటానికి కొత్తగా ఉంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది.
దహీ కే షోలే లాంటి వంటకాలు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి. పెరుగు, మసాలాలతో చేసిన ఫిల్లింగ్‌ను బ్రెడ్‌లో నింపి తేలికగా వేయిస్తే బయట కరకరగా, లోపల మృదువుగా ఉంటుంది. చివరగా పన్నీర్‌తో చేసే ఇండియన్ టాకోస్ కూడా కొత్త రుచిని ఇస్తాయి. మసాలా పన్నీర్, ఉల్లిపాయలు, పుదీనా చట్నీ కలిస్తే ఫ్యూజన్ స్టైల్ స్నాక్‌గా మారుతుంది.