- నంది అవార్డులు, నంది నాటకోత్సవాల పునరుద్ధరణకు శ్రీకారం..
- తిరుపతిని గ్లోబల్ డెస్టినేషన్ హబ్‌గా, విశాఖను, అమరావతిని మెగా టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన..
గత ఐదేళ్ల విధ్వంసం నుంచి పర్యాటక, సాంస్కృతిక రంగాలను గట్టెక్కించి ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖలపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.ఏపీ పర్యాటక రంగం ఇక 'రాష్ట్ర ఆర్థిక వృద్ధి యంత్రం'గా అభివర్ణించారు.
పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించారని, దీనివల్ల ఇన్వెస్టర్లకు జీఎస్టి, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, క్యాపిటల్ సబ్సిడీలు లభిస్తున్నాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ క్రమంలో 20 నెలల కాలంలో 117 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.19,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అందులో 27 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ అనుమతులు లభించాయని తద్వారా 1,22,637 మంది యువతకు ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడిందన్నారు.ప్రస్తుతం రూ.6681 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో 50వేల గదులు ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్ణయించగా 2025-26 నాటికి 5,232 బ్రాండెడ్ స్టార్ కేటగిరీ గదుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. దేశవ్యాప్తంగా 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటళ్లు ఏపీలోనే ఏర్పాటు కావడం కూటమి ప్రభుత్వంపై నమ్మకానికి నిదర్శనమని, ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. పర్యాటక శాఖను కేవలం వినోద సాధనంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమైన 'గ్రోత్ ఇంజిన్'గా తీర్చిదిద్దామన్నారు.
2047 నాటికి ఏపీని గ్లోబల్ టూరిజం హబ్‌గా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం కోసం విదేశీ పర్యాటకుల రాకలో టాప్ -10 రాష్ట్రాల్లో ఏపీని అగ్రపథాన నిలిపేందుకు కంకణబద్దులై ఉన్నామన్నారు. విదేశీ పర్యాటకుల గమస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దేశీయ పర్యాటకుల రాకలో ఏపీ 4వ స్థానంలో ఉందన్నారు.త్వరలోనే మొదటి రెండు స్థానాల్లో నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ గైడ్ లైన్స్, హోమ్ స్టే మరియు బ్రెడ్, బ్రేక్ ఫాస్ట్, ఉపాధి, క్యారవాన్, ల్యాండ్ అలాట్ మెంట్ తదితర పాలసీ లతో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికామన్నారు.
థీమాటిక్ సర్క్యూట్లు - మౌలిక వసతులు..కేంద్ర ప్రభుత్వ సాయం:
రాష్ట్రవ్యాప్తంగా 2 బుద్ధిస్ట్, 10 టెంపుల్, 5 బీచ్, 4 రివర్ క్రూయిజ్, 3 ఎకో, 2 సీ క్రూయిజ్, సీప్లేన్ టూరిజం సర్క్యూట్ తదితర 25కి పైగా థీమాటిక్ సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా తొట్లకొండ, బావికొండ, నాగార్జున కొండ, ఘంటసాల వంటి ప్రాంతాలను బుద్ధిస్ట్ సర్క్యూట్ లుగా చేయాలని నిర్ణయించామన్నారు. శ్రీశైలం నుండి హెలికాప్టర్ పర్యాటక సేవలను ప్రారంభించబోతున్నామన్నారు. ఇప్పటివరకు కేంద్రం నుండి రూ.428 కోట్ల గ్రాంట్లు సాధించి శాస్కి, ప్రసాద్, స్వదేశీ దర్శన్, సీబీడీడీ తదితర స్కీమ్ ల ద్వారా అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్, అహోబిలం, అన్నవరం, సింహాచలం, బొర్రాగుహలు వంటి 8 పర్యాటక ప్రాజెక్టులు చేపట్టి ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన చేస్తున్నామన్నారు.ఏపీటీడీసీ ఆధ్వర్యంలో రూ.115 కోట్ల వ్యయంతో 15 హరిత హోటళ్లను ఆధునీకరించి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు.తిరుపతిని గ్లోబల్ డెస్టినేషన్ హబ్‌గా, విశాఖను, అమరావతిని మెగా టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు..
పాలసీ, పార్ట్ నర్ షిప్, ప్రాసెస్ వంటి 3పీ పాలసీతో ముందుకు వెళ్తున్నామన్నారు. పాలసీ తెచ్చి ఇన్వెస్టర్లతో భాగస్వామ్యమై త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. ఏపీ బ్రాండ్ పెరిగేలా ఏడాదంతా పర్యాటక శోభ కలిగించేలా పర్యాటక ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే విశాఖ, అరకు, అనకాపల్లి ఉత్సవ్, విజయవాడ ఉత్సవ్, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్, సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవ్, మచిలీపట్నంలో మసూలా బీచ్ ఫెస్టివల్,కోనసీమలో ప్రభల తీర్థం, రామచంద్రాపురం, ఆత్రేయపురంలో బోట్ ఫెస్టివల్ , కొండవీడు ఉత్సవాలను ఘనంగా దిగ్విజయంగా నిర్వహించామని వివరించారు. నాడు కొండవీడు కోటకు వెళ్లేందుకు ఘాట్ రోడ్డుకు సీఎం చంద్రబాబునాయుడు 50 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల నిర్వహించిన ఉత్సవం ద్వారా కొండవీటి రాజుల పరిపాలన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించామని, త్వరలోనే కొండవీడును నిర్వహించి ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమై ఉన్నామని స్పష్టం చేశారు.
జాతీయ, అంతర్జాతీయ వేదికపై పర్యాటక వాణి..
రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, విజయవాడలో, దేశంలోని ఢిల్లీ, ముంబయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పర్యాటక గొప్పతనాన్ని తెలిపేలా రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లు నిర్వహించి ఏపీ పర్యాటక ప్రదేశాల గొప్పతనాన్ని వినిపించామని మంత్రి దుర్గేష్ అన్నారు. పలువురు శాసనసభ్యుల వినతి మేరకు 28 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. తగిన ప్రణాళిక, కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పర్యాటకం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఉదాహరణకు కంభం చెరువును ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో ఎమ్మెల్యేలు అడిగిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేస్తామన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ ద్వారా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయాలకు నిధులు కోరామన్నారు. లేపాక్షిని అద్భుత కేంద్రంగా తీర్చిదిద్దాలని డీపీఆర్ కేంద్రానికి ఇచ్చామన్నారు. కొండవీడుపై, మచిలీపట్నం బీచ్ అభివృద్ధిపై డీపీఆర్ లు కేంద్రానికి పంపించామన్నారు. త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని కేరళను మించిన స్థాయిలో బ్రాండింగ్ చేసేందుకు బడ్జెట్ లో నిధులు ప్రతిపాదించామన్నారు.టూరిజం ఆపరేటర్లను, డ్రైవర్ కమ్ గైడ్ కార్యక్రమం ద్వారా డ్రైవర్లను అంబాసిడర్లుగా గుర్తించామన్నారు. వారి ద్వారా పర్యాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.
ఏపీకి క్యూ కట్టిన ప్రఖ్యాత సంస్థలు..
పర్యాటక శాఖ వెబ్ సైట్ లో ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో స్పష్టంగా పొందుపరిచామని ప్రైవేట్ ఇన్వెస్టర్లకు సూచించారు. పెట్టుబడి పెట్టాలనుకునే ఏ ఇన్వెస్టర్ అయినా తొలుత 25,000 చెల్లిస్తే సంబంధిత కంపెనీ నెట్ వర్త్, టైఅప్ తో రావడం చూసి పర్యాటక శాఖ కేపబుల్ అని భావిస్తే ఎస్ఐపీబీలో అనుమతి పొంది సంబంధిత ప్రాజెక్టుకు ల్యాండ్ కేటాయించి స్టార్ హోటల్లు, రిసార్ట్స్ నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే తాజ్, మేఫెర్, మారియట్, అట్మోస్పియర్ కోర్ తదితర ఇంటర్నేషనల్ సంస్థలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించి పెట్టుబడులు ఆయా ప్రాంతాల్లో పెట్టేలా ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు.
కేంద్రానికి పలు ప్రతిపాదనలు.. సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం..
లలిత కళలను ప్రోత్సహించేందుకు, యువ కళాకారులకు మద్దతుగా విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. సాంస్కృతిక ప్రదర్శనలు చేసేందుకు విజయవాడలోని జీవీఆర్ మ్యూజిక్, డ్యాన్స్ కాలేజీలో కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం, రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో తెలుగు భాష, సాహిత్యాన్ని, సంగీత, నృత్య, నాటక కళలను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు, రచయితలకు అవకాశాలు కల్పించేందుకు సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా కోరామన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటువును పునర్ముద్రించాలని, భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన అవసరాన్ని వివరించామన్నారు.
దీనికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. కొండపల్లి, కూచిపూడి, కడియం, మంగళగిరి, చీరాల, బాపట్ల, అరకు తదితర 14 ప్రాంతాల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకులు ఏదైనా పర్యాటక ప్రాంతం వెళ్లి కేవలం చూసి రాకుండా అనుభూతి చెందేలా వీటిని తీర్చిదిద్దుతున్నామన్నారు. కూచిపూడి నాట్యం పుట్టిన ఊరిపేరే కూచిపూడి గ్రామంగా మారిందని అభివర్ణిస్తూ కూచిపూడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల్లో టెంపుల్ టూరిజాన్ని, అలాగే విశాఖ, అమరావతిలో హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో పర్యాటకం, అటవీ, ఇరిగేషన్, దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖలతో సబ్ కమిటీ ఏర్పాటైందని, ఆయా శాఖలతో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకొని పర్యాటకంగా ముందుకు వెళ్లేలా, పర్యాటక రంగాన్ని విస్తృతపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం…
ఏవి తల్లి నిరుడు కురుసిన హిమ సమూహంలు అని ఉదహరిస్తూ గత ప్రభుత్వంలో కళలు కళావిహీనమయ్యాయని మంత్రి దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో కళా ఉత్సవాలు లేవని, పురస్కారాలు లేవని, కళాకారులు సంతోషంగా లేరని గుర్తించిన కూటమి ప్రభుత్వం కళాకారులకు గౌరవాన్ని తిరిగి తెచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.ఈ క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు సూచనల మేరకు 2025లో ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 110 మంది నాటక కళాకారులకు కందుకూరి పురస్కారాలు, 200 మందికి పైగా కవులు, కళాకారులకు ఉగాది పురస్కారాలు (కళారత్న) అందించామన్నారు. 2026కు కూడా కసరత్తు పూర్తయిందని తెలిపారు. సామాజిక చైతన్యానికి ప్రతీకగా గుర్రం జాషువా, బోయి భీమన్నల పురస్కారాలను ప్రదానం చేశామన్నారు.వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా రాష్ట్ర పండుగగా 'తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తూనే తెలుగు భాషా పురస్కారాల ప్రదానం చేశామన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ నంది అవార్డుల పునరుద్ధరణపై కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే సీఎం చంద్రబాబునాయుడు ఆమోదంతో తుది ప్రకటన ఉంటుందన్నారు.
నూతన ఫిల్మ్ పాలసీ - ఫిల్మ్ టూరిజం
సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సినిమాటోగ్రఫీ ద్వారా ఫిల్మ్ టూరిజం అభివృద్ధికి ఫిల్మ్ టూరిజం పాలసీ తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు ఉచిత అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. షూటింగ్ ల ద్వారా పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తెచ్చి మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. ఏపీలో రిజిస్టర్ అయిన చిన్న చిత్రాలకు 9% జీఎస్టీ మినహాయింపు మరియు ఏటా 15 లో బడ్జెట్ చిత్రాలకు రూ.10 లక్షల చొప్పున నగదు సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
నూతన ఫిల్మ్ పాలసీ, ఫిల్మ్ టూరిజం, సింగిల్ విండో సిస్టమ్, టికెట్ ధరల క్రమబద్ధీకరణ తదితర అంశాలతో సినిమాటోగ్రఫీలో విస్తృతమైన ప్రక్రియలకు శ్రీకారం చుట్టామన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జరిగిన చర్చల అనంతరం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.ఏపీలో సినిమా షూటింగ్ లు జరుగుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత ఉందన్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్లను ఆహ్వానించామన్నారు. స్టూడియోలు, రీరికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణం మరియు షూటింగ్ లొకేషన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
సభ్యుల సూచనలపై మంత్రి దుర్గేష్ స్పందన..
ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మండలి బుద్ధ ప్రసాద్, విష్ణుకుమార్ రాజు, అయితాబత్తుల ఆనందరావుల సూచనలపై మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారు. నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి పక్కా భవనం, హైదరాబాద్ నుంచి ఏపీకి రావాల్సిన పురావస్తు సంపద సేకరణ, విశాఖ ఫిల్మ్ నగర్ సొసైటీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.రాష్ట్రంలో రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ బీచ్ హోదా ఉందని, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రతిపాదన మేరకు ఎస్. యానాం బీచ్ లాంటి మరికొన్ని బీచ్ ల్లో శుభ్రత, భద్రత, పర్యావరణం వంటి అంశాలకు పెద్దపీట వేసి బ్లూఫ్లాగ్ బీచ్ గుర్తింపు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
గత ప్రభుత్వంపై మంత్రి దుర్గేష్ ఫైర్..
గత ప్రభుత్వంలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని చెబుతూ అభివృద్ధి కంటే విధ్వంసానికే నాడు ప్రాధాన్యతనిచ్చారని మంత్రి దుర్గేష్ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక శాఖకు ఏటా రూ.7 కోట్ల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్స్ స్థానంలో గత ప్రభుత్వం రూ.434 కోట్లతో రుషికొండ ప్యాలెస్ ను నిర్మించడం వల్ల పర్యాటక శాఖ ఆదాయం కోల్పోయిందన్నారు. రుషికొండ ప్యాలెస్ వంటి స్వప్రయోజన నిర్మాణాల వల్ల రాష్ట్రానికి ఆదాయం పోగా అదనపు భారం పడిందని తెలిపారు. దాని వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో కేరళను మించిన అందాలు ఉన్నప్పటికీ బ్రాండింగ్ చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
2019-24 కాలంలో పర్యాటకాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఫైర్ అయ్యారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడంతో పాటు వివిధ పర్యాటక ఉత్సవాల నిర్వహణకు రూ. 150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించామన్నారు. కేంద్ర ప్రభుత్వ'పూర్వోదయ' పథకాల ద్వారా వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని, కనెక్టివిటీని మెరుగుపరచాలని నిర్ణయించామన్నారు. ఏపీకి ఎక్కువ మంది గైడ్లు వచ్చేలా చర్యలు చేపడుతామన్నారు.వారికి శిక్షణ ఇచ్చి పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తామన్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
2019-24 మధ్య కాలంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా అడుగంటిన, నత్తనడకన నడిచిన, విధ్వంసానికి గురైన పర్యాటక రంగాన్ని నేడు సీఎం చంద్రబాబునాయుడు దూరదృష్టితో, దిశానిర్దేశంతో పట్టాలెక్కించామన్నారు. సాంస్కృతిక రంగానికి పునరుజ్జీవం కల్పించామన్నారు.కళాకారులను ఆదరిస్తున్నామన్నారు. సినిమాటోగ్రఫీకి పెద్దపీట వేస్తూ ఏపీలో చలనచిత్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. పరిమిత వనరులతో అపరిమిత కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నామని లియోనెల్ రాబిన్స్ చెప్పిన సూక్తిని పర్యాటక రంగానికి వర్తించేలా ఉదహరించారు.