దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు డెలివరీ యాప్‌లలో అమలు చేస్తున్న 10 నిమిషాల ఫాస్ట్ డెలివరీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, గతంలో ఉన్న పాత పేఔట్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా లక్షా 50 వేల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మె ప్రభావంతో పీక్ అవర్స్‌లో ఆహార, కిరాణా డెలివరీ సేవలు తీవ్రంగా అంతరాయం కలగవచ్చని పేర్కొంటున్నారు.
ఈ ఉద్యమానికి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (Indian Federation of App-based Transport Workers) ఆధ్వర్యం వహించింది. గిగ్ వర్కర్ల మాటల్లో చెప్పాలంటే ఫాస్ట్ డెలివరీ కారణంగా రైడర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నిర్ణీత సమయంలో ఆర్డర్ డెలివరీ చేయాలనే లక్ష్యంతో రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవ్ చేయాల్సి వస్తుందని దీని వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ప్రమాదం ఉన్నా, యాప్‌లలో ఇటీవల చేసిన పేఔట్ మార్పుల కారణంగా తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని వర్కర్లు వాపోతున్నారు.
గతంలో పండుగ సీజన్లలో సరైన రేటు కార్డ్, ఇన్సెంటివ్ విధానం ఉండేదని గిగ్ వర్కర్లు గుర్తు చేస్తున్నారు. దసరా, దీపావళి, బక్రీద్ వంటి సందర్భాల్లో పని చేసిన వారికి అదనపు ప్రోత్సాహకాలు లభించేవని ఇప్పుడు ఆ విధానం పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. పాత పేఔట్ విధానాన్ని మళ్లీ అమలు చేయడంతో పాటు, పారదర్శకమైన రేటు కార్డ్‌ను ప్రకటించాలని వారు కోరుతున్నారు. అలాగే సరైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలని స్విగ్గి జొమాటో వంటి అగ్రిగేటర్ కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు.
సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను కంపెనీలు బెదిరిస్తున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆందోళనల్లో పాల్గొంటే ఐడీలను బ్లాక్ చేయిస్తున్నారని, టీమ్ లీడర్లు, ఏరియా మేనేజర్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని వర్కర్లు చెబుతున్నారు. గతంలో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొనడంతో అనేక నగరాల్లో డెలివరీలు ఆలస్యమయ్యాయని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
డెలివరీ ఏజెంట్ల రోజువారీ జీవితంపై ఈ విధానాల ప్రభావం తీవ్రంగా ఉందని వారు వివరిస్తున్నారు. రోజుకు 14 నుంచి 16 గంటలు రోడ్లపై గడిపినా సరైన ఆదాయం రావడం లేదని పలువురు చెప్పుకొచ్చారు. ఒక ఆర్డర్ రద్దయినా లేదా కస్టమర్ అందుబాటులో లేకపోయినా, తప్పు తమది కాకపోయినా పెనాల్టీ మాత్రం రైడర్‌కే పడుతోందని చెబుతున్నారు. ప్రమాదాలు జరిగితే కంపెనీల నుంచి సరైన బీమా సాయం కూడా అందడం లేదని, చివరకు తోటి కార్మికులే డబ్బులు వేసి సహాయం చేస్తున్నారని కొందరు తెలిపారు.
ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల నుంచి కూడా స్పందనలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ 10 నిమిషాల ఫాస్ట్ డెలివరీ యాప్‌లను నిషేధించాలని మరోసారి డిమాండ్ చేశారు. గిగ్ వర్కర్ల కష్టాల మీదే కంపెనీలు బిలియన్ డాలర్ విలువైన యూనికార్న్‌లుగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. ఫాస్ట్ డెలివరీ గ్యారంటీ వల్ల రైడర్లు ప్రమాదకరంగా డ్రైవ్ చేయాల్సి వస్తోందని, అయినా వారికి సాధారణ కార్మిక హక్కులు కూడా లేవని పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల పనిగంటలకు పరిమితి విధించి, కనీస భద్రతా ప్రమాణాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.