Chandrababu: ఉపాధి హామీ నిధులను పూర్తిగా వినియోగించాలి.. జలధారపై సీఎం సమీక్ష!
Chandrababu: రాష్ట్రంలో నీటి భద్రతను పెంచేందుకు చేపడుతున్న జలధార-జలహారతి కార్యక్రమంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టేలా నీటి వనరులు సిద్ధం చేయాలి: చంద్రబాబు..
జలధార పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలి: అధికారులకు సీఎం ఆదేశం..
అమరావతి: రాష్ట్రంలో నీటి భద్రతను పెంచేందుకు చేపడుతున్న జలధార-జలహారతి కార్యక్రమంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
జలధార-జలహారతి పనుల పురోగతిపై శనివారం సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జలధార పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా జలధార పనులు చేపట్టాలని సీఎం సూచించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను హెచ్చరించారు.
వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టే విధంగా నీటి వనరులను ముందుగానే సిద్ధం చేయాలని చంద్రబాబు అన్నారు. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ నీరు ఉన్న ప్రాంతాలకు అనుసంధానం చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
జలధార కార్యక్రమంలో భాగంగా చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, కాంటూర్ కందకాల పునరుద్ధరణ పనుల్లో ఆలస్యం చేయవద్దని సీఎం తెలిపారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను పరిశీలించాలని సూచించారు.
ప్రతి జిల్లాలో నీటి భద్రత కోసం ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జలధార మొదటి దశ పనులు పూర్తయిన తర్వాత చెక్ డ్యామ్‌లు, ఫామ్ పాండ్లు, చెరువులకు నష్టం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు.
కాల్వలు, కరకట్టలను బలోపేతం చేసి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
జలధార కార్యక్రమం వల్ల కలిగే ప్రయోజనాలను ఇరిగేషన్, అవేర్ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సీఎం తెలిపారు. జిల్లాల వారీగా భూగర్భ జలాల పెరుగుదల, పునరుద్ధరణకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, రైతులు, నీటి సంఘాలను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే నీటి వనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Be the first to react