Kollu Ravindra: ప్రజలే కూటమి ప్రభుత్వానికి సుప్రీం లీడర్లు.. మంత్రి కొల్లు రవీంద్ర!
Kollu Ravindra: ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజలే ప్రభుత్వానికి సుప్రీం లీడర్లని ఆయన పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గ్రీవెన్స్‌లో మంత్రి కొల్లు రవీంద్ర..
మచిలీపట్నంలో 408 ఫిర్యాదులు.. 318 సమస్యలకు పరిష్కారం..
మచిలీపట్నం: ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజలే ప్రభుత్వానికి సుప్రీం లీడర్లని ఆయన పేర్కొన్నారు.
మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి వారం ఒకరోజు గ్రీవెన్స్ నిర్వహించడం ద్వారా ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు.
గత ఐదేళ్లలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం అభివృద్ధి కంటే రాజకీయ అలజడులకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతున్నామని చెప్పారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు 408 ఫిర్యాదులు అందగా, వాటిలో 318 సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
2014-19 మధ్య రాష్ట్ర నిర్మాణం వేగంగా సాగిందని, ఆ తర్వాత వచ్చిన పాలనలో రాష్ట్ర వ్యవస్థలు దెబ్బతిన్నాయని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వర్గాలు వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడిందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై నమ్మకం పెరగడంతో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, రోడ్ల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ హంద్రీనీవా ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షం మాత్రం ప్రజల్లో విభేదాలు సృష్టించే రాజకీయాలు చేస్తోందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చినా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పనులు చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం పోలవరం, అమరావతి, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి వివరించారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ సంస్థ, అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్, రాయలసీమలో వాహన తయారీ సంస్థలు వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుతో పాటు పోర్టులు, రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని మంత్రి అన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, బాబాప్రసాద్, పట్టణ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, గ్రామీణ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Be the first to react