బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. తుఫాను హెచ్చరికలు జారీ!

Cyclone Arnab Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం నాటికి తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి బంగ్లాదేశ్ ప్రతిపాదించిన 'అర్నాబ్' అనే పేరును పెట్టనున్నారు. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ గంటకు 70–90 కి.మీ వేగంతో పెనుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిపించే ప్రమాదం ఉంది. మంగళ, బుధవారాల్లో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని APSDMA హెచ్చరించింది.

తుఫాను హెచ్చరికలు
తుఫాను హెచ్చరికలు
  • ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వైపు కదలిక.. గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో పెనుగాలులు!

  • మంగళ, బుధవారాల్లో తీర ప్రాంత జిల్లాల్లో కుండపోత వర్షాలు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం!

  • నేడు కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలో మోస్తరు వర్షాలు!

ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శరవేగంగా బలపడుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ఇది శనివారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెంది, పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అనంతరం సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది పూర్తి స్థాయి తుపానుగా (Cyclone) మారే అవకాశముంది.

తుపానుకు 'అర్నాబ్'గా నామకరణం

అక్టోబర్ 26 నాటికి ఈ వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి 'అర్నాబ్' (Cyclone Arnab) అని నామకరణం చేయనున్నారు. బెంగాలీ భాషలో 'అర్నాబ్' అంటే 'సముద్రం' అని అర్థం. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) నిబంధనల ప్రకారం ఈ పేరును పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ప్రతిపాదించింది.

తీరం వైపు కదలిక & పెనుగాలుల తీవ్రత

సోమవారం తుపానుగా మారిన తర్వాత, ఇది మరింత బలపడి తర్వాతి రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 26 నుంచి సముద్రంలో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గరిష్ఠంగా వీటి వేగం గంటకు 90 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఏపీ, తెలంగాణల్లో భారీ వర్ష సూచన

Environment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మంగళ, బుధవారాల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. శనివారం కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.

మత్స్యకారులు, రైతులకు అత్యవసర హెచ్చరికలు

సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని APSDMA స్పష్టం చేసింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినకుండా రైతులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags

Be the first to react

Latest