Nimmala Ramanaidu: పుష్కర ఎత్తిపోతల పనుల్లో అలసత్వం వద్దు.. కాంట్రాక్టర్లకు మంత్రి నిమ్మల హెచ్చరిక!

Nimmala Ramanaidu: పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన కీలక పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Nimmala Ramanaidu
Nimmala Ramanaidu

పుష్కర పైప్‌లైన్ పనులపై మంత్రి నిమ్మల సీరియస్.. రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే..

పనుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రిమినల్ కేసులు.. పుష్కర పనులపై మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు..

విజయవాడ: పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన కీలక పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల పురోగతిపై బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులను మంత్రి ప్రశ్నించారు.

ఇటీవల పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు వర్క్ షెడ్యూల్ అందజేశారని మంత్రి తెలిపారు.

ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనే అంశంపై ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక అందించినట్లు చెప్పారు. షెడ్యూల్ అందించినప్పటికీ పనుల్లో వేగం ఎందుకు పెరగలేదని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడే అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో అలసత్వం ప్రదర్శించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని కాంట్రాక్టు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు ప్రజాప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, జైలుకు పంపేందుకు కూడా వెనుకాడవద్దని పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఈఈకి మెమో జారీ చేయాలని ఈఎన్సీ నరసింహమూర్తిని మంత్రి ఆదేశించారు. ఇకపై పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులపై ప్రతిరోజూ వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.

మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో పోలవరం జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. పనుల ప్రస్తుత పరిస్థితి, నిర్దేశిత లక్ష్యాలు, ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించే చర్యలపై సమీక్షలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.

ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో పుష్కర ఎత్తిపోతల పథకం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అందువల్ల ప్రాజెక్టు పనులను ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు వెళ్లేలా నీటిని విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు.

ఈ నేపథ్యంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు పుష్కర ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచాలని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest