డిస్కో శాంతి రీఎంట్రీపై లారెన్స్ బ్రదర్ ఎల్విన్ ఎమోషనల్.. ‘అక్కా.. ఎప్పటికీ రుణపడి ఉంటా’

Disco Shanti Re-Entry: దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన నటి డిస్కో శాంతి మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాఘవ లారెన్స్, ఆయన సోదరుడు ఎల్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బుల్లెట్’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్విన్ చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Elvin's Emotional Note on Disco Shanti's Comeback with bullet movie
Elvin's Emotional Note on Disco Shanti's Comeback with bullet movie
  • దాదాపు 28 ఏళ్ల తర్వాత ‘బుల్లెట్’ సినిమాతో డిస్కో శాంతి వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు.
  • తమ్ముడు ఎల్విన్‌పై ఉన్న ప్రేమతోనే తన సినిమాలో నటించేందుకు అంగీకరించారని ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Disco Shanti Re-Entry: దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన నటి డిస్కో శాంతి మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాఘవ లారెన్స్, ఆయన సోదరుడు ఎల్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బుల్లెట్’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్విన్ చేసిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డ్యాన్స్‌తో ప్రత్యేక గుర్తింపు.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం

డిస్కో శాంతి ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు క్రమంగా దూరమయ్యారు. చివరిగా 1997లో విడుదలైన కన్నడ చిత్రం ‘యుద్ధ’లో కనిపించారు. అప్పటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు.

‘బుల్లెట్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్

ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బుల్లెట్’ చిత్రంలో రాఘవ లారెన్స్, ఆయన సోదరుడు ఎల్విన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘బుల్లెట్టు బండి’ పేరుతో విడుదల చేయనున్నారు. గతేడాది ఆగస్టులో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంలో డిస్కో శాంతి నటిస్తున్న విషయాన్ని ఎల్విన్ వెల్లడించారు. ఆమె ఫస్ట్ లుక్‌ను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ లుక్‌ను బట్టి ఆమె సినిమాలో మంత్రగత్తె పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అక్కా అనే పిలుపుతోనే సినిమా అంగీకారం.. ఎల్విన్ భావోద్వేగం

డిస్కో శాంతి తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయురాలని ఎల్విన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆమె తమకు సహనటి మాత్రమే కాదని, సొంత అక్కలాంటి వ్యక్తి అని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తాను, తన అన్నయ్య ఆమెను అక్కా అని పిలుచుకుంటున్నామని గుర్తుచేసుకున్నారు.

ఎంతోమంది గతంలో సినిమాల్లో నటించాలని ఆమెను సంప్రదించినప్పటికీ అంగీకరించలేదని, అయితే తమపై ఉన్న ఆప్యాయతతో తన తొలి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని వెల్లడించారు. పేరు, డబ్బు, గుర్తింపు కోసం కాకుండా తమ్ముళ్ల సినిమా బాగా రావాలనే ప్రేమతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని భావోద్వేగంగా రాసుకొచ్చారు.

సినిమాలో కీలకమైన ట్విస్ట్ ఆమె పాత్రతోనే!

‘బుల్లెట్’ కథలో డిస్కో శాంతి పాత్ర చాలా కీలకమని ఎల్విన్ వెల్లడించారు. సినిమాలో వచ్చే ఒక పెద్ద ట్విస్ట్‌కు ఆమె పాత్రే కారణమవుతుందని ఆసక్తికర విషయం పంచుకున్నారు. ఆమె ప్రేమ, నమ్మకం, మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంటూ.. అక్కా, నీ ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తన అభిమానాన్ని చాటుకున్నారు.

మొత్తానికి దాదాపు 28 ఏళ్ల తర్వాత డిస్కో శాంతి మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ‘బుల్లెట్’ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags

Be the first to react

Latest