Tirumala Brahmotsavam: తిరుమల చరిత్రలోనే తొలిసారి... బ్రహ్మోత్సవాల్లో కనువిందు చేయనున్న NRI కళాబృందాలు!
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే వాహనసేవల ముందు తొలిసారిగా విదేశీ, ఎన్నారై సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. సింగపూర్, జర్మనీ దేశాల నుంచి కళాకారులు ఎటువంటి పారితోషికం ఆశించకుండా సొంత ఖర్చులతో స్వామివారి సేవకు తరలివస్తున్నారు. వీరికి టీటీడీ వసతి, దర్శన ఏర్పాట్లు కల్పిస్తుండగా, స్వదేశీ కళాకారుల గౌరవ వేతనాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తోంది.
టీటీడీ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా: స్వామివారి సేవలో తరిస్తున్న విదేశీయులు
బ్రహ్మోత్సవాల్లో కనువిందు చేయనున్న ఆ గ్లోబల్ ఆర్ట్ టీమ్స్ ఏవి?!
వాహన సేవల ముందు సరికొత్త భక్తి నృత్యాలు: భక్తులను మంత్రముగ్ధులను చేయనున్న ఆ సరికొత్త ప్లాన్ ఇదే!
Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈసారి సరికొత్త అంతర్జాతీయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే వాహనసేవల ముందు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలలో విదేశీ కళా బృందాలు కూడా పాలుపంచుకోనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విదేశీ సాంస్కృతిక బృందాలు బ్రహ్మోత్సవ సంబరాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
సొంత ఖర్చులతో తరలివస్తున్న ఎన్నారై, విదేశీ బృందాలు
సింగపూర్, జర్మనీ వంటి దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో పాటు పలువురు విదేశీయులు కూడా హిందూ సంస్కృతి, సనాతన ధర్మంపై ఉన్న మక్కువతో శ్రీవారి సేవలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరంతా సొంత ఖర్చులతో ప్రయాణమై తిరుమలకు చేరుకుంటున్నారు. టీటీడీ నుంచి ఎలాంటి పారితోషికాన్ని ఆశించకుండా కేవలం స్వామివారి కైంకర్యంగా భావించి తమ కళను తిరుమాడ వీధుల్లో ప్రదర్శించడానికి ఆసక్తి కనబరచడం విశేషం.
టీటీడీ ప్రత్యేక మర్యాదలు – వసతి ఏర్పాట్లు
స్వచ్ఛందంగా వచ్చే విదేశీ కళాకారులకు టీటీడీ ఉన్నతాధికారులు సముచిత గౌరవం కల్పిస్తున్నారు. పారితోషికం తీసుకోకుండా స్వామివారి సేవలో పాల్గొంటున్నందుకు గుర్తింపుగా వారికి ప్రత్యేక దర్శన సౌకర్యాలు, వసతి, లడ్డూ ప్రసాదం మరియు స్థానిక రవాణా సదుపాయాలను దేవస్థానమే దగ్గరుండి సమకూరుస్తోంది. రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో కూడా అమెరికాలోని లాస్ ఏంజెల్స్, డల్లాస్ తో పాటు గల్ఫ్ దేశాలైన ఖతార్, దుబాయ్ నుంచి మరిన్ని బృందాలు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.
దేశీయ కళాకారులకు నేరుగా చెల్లింపులు – దళారులకు చెక్
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే స్వదేశీ కళాకారుల గౌరవ వేతనాల విషయంలో టీటీడీ పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి దళారీ వ్యవస్థకు తావులేకుండా కళాకారుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేయాలని నిర్ణయించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్‌లను ఒకే వేదికపైకి తెచ్చి దాదాపు అన్ని రాష్ట్రాల సాంప్రదాయ నృత్య, సంగీత ప్రదర్శనలను బ్రహ్మోత్సవాలలో వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
Tags
Be the first to react