శబరిమలలో 11 వేల లీటర్ల నెయ్యి కుంభకోణం.. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు!
Sabarimala Ghee Scam: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి నెయ్యి సరఫరా వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2025 తీర్థయాత్ర సీజన్‌లో ఆలయానికి సరఫరా చేయాల్సిన సుమారు 11 వేల లీటర్ల నెయ్యిని పక్కదారి పట్టించి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినట్లు ఆరోపణలు రావడంతో కేరళ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (VACB) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తమిళనాడులోని ఒట్టంచత్రం ప్రాంతానికి చెందిన హోల్‌సేల్ వ్యాపారులు వెంకటేశ్వరన్, కుమరన్‌లను అధికారులు అరెస్టు చేశారు.
శబరిమల అయ్యప్ప స్వామి నెయ్యి సరఫరాలో భారీ అక్రమాలు.. 11 వేల లీటర్ల నెయ్యి పక్కదారి..
శబరిమల ఆలయానికి తక్కువ నాణ్యత నెయ్యి సరఫరా? రూ.2.5 కోట్ల నష్టం కలిగించిన అక్రమాలు..
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి నెయ్యి సరఫరా వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 2025 తీర్థయాత్ర సీజన్‌లో ఆలయానికి సరఫరా చేయాల్సిన సుమారు 11 వేల లీటర్ల నెయ్యిని పక్కదారి పట్టించి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినట్లు ఆరోపణలు రావడంతో కేరళ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (VACB) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో తమిళనాడులోని ఒట్టంచత్రం ప్రాంతానికి చెందిన హోల్‌సేల్ వ్యాపారులు వెంకటేశ్వరన్, కుమరన్‌లను అధికారులు అరెస్టు చేశారు.
విజిలెన్స్ అధికారుల వివరాల ప్రకారం.. కేరళ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (KCMMF) తన మిల్మా (Milma) బ్రాండ్ ద్వారా శబరిమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే, ఈ అధికారిక సరఫరాలో భాగంగా ఆలయానికి చేరాల్సిన నెయ్యిలో సుమారు 11 వేల లీటర్లను కాంట్రాక్టర్ ఎస్.ఎస్. బిను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నెయ్యిని తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారులకు సుమారు రూ.50 లక్షలకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా నెయ్యిని విక్రయిస్తున్న విషయం తెలిసినా, వ్యాపారులు కొనుగోలుకు అంగీకరించినట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ బినును గత నెలలోనే అధికారులు అరెస్టు చేశారు. ఆలయానికి సరఫరా చేయాల్సిన నాణ్యమైన నెయ్యిని పక్కదారి పట్టించిన అనంతరం, దాని స్థానంలో తక్కువ ధర కలిగిన నెయ్యిని శబరిమలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల కారణంగా ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB)కు సుమారు రూ.2.5 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
నెయ్యి సరఫరా వ్యవహారంలో అక్రమాలు జరగడానికి ఆలయ స్టోర్‌లో పనిచేసిన కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2025 తీర్థయాత్ర సమయంలో శబరిమల స్టోర్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఉద్యోగి జయలాల్‌ను విజిలెన్స్ అధికారులు గతంలోనే అరెస్టు చేశారు. నెయ్యి సరఫరాకు సంబంధించిన రిజిస్టర్‌లో తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సరఫరా చేసిన నెయ్యి పరిమాణం, సంబంధిత లెక్కల్లో అవకతవకలు జరిగాయనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ సహా మరో ఇద్దరిపై కూడా విజిలెన్స్ అధికారులు గతంలో కేసులు నమోదు చేశారు. మొత్తం ముగ్గురిని నెయ్యి కొనుగోలు ప్రక్రియలో జరిగిన అక్రమాలకు సంబంధించి విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు. శబరిమల స్పెషల్ కమిషనర్ ఈ వ్యవహారాన్ని కేరళ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సాధారణంగా పాటించాల్సిన టెండర్ విధానాలను పక్కనపెట్టారని, KCMMF సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై కూడా అనుమానాలు ఉన్నాయని స్పెషల్ కమిషనర్ కోర్టుకు నివేదించారు. దీంతో ఈ వ్యవహారంపై VACB దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా విజిలెన్స్ అధికారి హైకోర్టుకు సమర్పించిన వివరాలు కూడా పలు అనుమానాలకు తావిచ్చాయి. నెయ్యి కొనుగోలు కోసం తొలుత ఈ-టెండర్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, మధ్యలోనే దానిని నిలిపివేసి KCMMFకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. అప్పటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మురారి బాబు చేసిన సిఫార్సు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. KCMMF సరఫరా చేసే నెయ్యి నాణ్యమైనదని, తక్కువ పరిమాణంలో వినియోగించినా సరిపోతుందని ఆయన సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారి వివరించారు. అయితే, ఈ నిర్ణయం వెనుక టెండర్ నిబంధనలను ఎందుకు పక్కనపెట్టాల్సి వచ్చిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
శబరిమల ఆలయానికి సరఫరా చేసే నెయ్యి భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న కీలకమైన అంశం. అలాంటి సరఫరాలోనే నాణ్యత, కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, పంపిణీకి సంబంధించిన అక్రమాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఇద్దరు వ్యాపారుల అరెస్టుతో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెయ్యి పక్కదారి పట్టించిన కాంట్రాక్టర్ నుంచి మొదలుకొని, కొనుగోలు చేసిన వ్యాపారులు, ఆలయ స్టోర్ సిబ్బంది, టెండర్ ప్రక్రియలో నిర్ణయాలు తీసుకున్న అధికారుల వరకు ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Be the first to react