Gold Rate Today: షాకిచ్చిన పసిడి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ తగ్గుముఖం పట్టడంతో భారీగా తగ్గిన ఆభరణాల విక్రయాలు!

Gold Rate Today: భారత్‌లో పెరిగిన ధరలు, దిగుమతి సుంకం పెంపు వంటి కారణాలతో పసిడి డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం గిరాకీ గత ఏడాదితో పోలిస్తే 6 శాతం క్షీణించి 131.4 టన్నులకు పరిమితమైంది.

షాకిచ్చిన పసిడి ధరలు..
షాకిచ్చిన పసిడి ధరలు..
  • విలువ పరంగా మాత్రం రికార్డ్.. రూ.1.98 లక్షల కోట్లకు చేరిన డిమాండ్..

  • ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో తగ్గిన బంగారం డిమాండ్..

Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటం, దిగుమతి సుంకం పెంపు మరియు వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్‌లో పసిడి కొనుగోళ్లు నెమ్మదించాయి. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (Q2) బంగారం గిరాకీ గత ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గింది. ఈ కాలంలో మొత్తం డిమాండ్ 131.4 టన్నులకు పరిమితమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council - WGC) గురువారం విడుదల చేసిన తన త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. 2025 ఇదే త్రైమాసికంలో భారతీయ పసిడి డిమాండ్ 139.7 టన్నులుగా నమోదైనట్లు పేర్కొంది.

పరిమాణం తగ్గినా.. విలువలో 50% ఎగిసిన రికార్డు!
కొనుగోళ్ల పరిమాణం (Volume) టన్నుల లెక్కన తగ్గినప్పటికీ, విలువ (Value) పరంగా మాత్రం బంగారం డిమాండ్ భారతదేశంలో ముందెన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ రికార్డును తాకింది.

గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో రూ. 1,32,500 కోట్లుగా ఉన్న పసిడి కొనుగోళ్ల విలువ, ఈ ఏడాది ఏకంగా 50 శాతం పెరిగి రూ. 1,98,100 కోట్లకు చేరింది. బంగారం ధరలు చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకోవడమే ఈ అనూహ్య రికార్డుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఇండియా సీఈవో సచిన్ జైన్ వివరించారు. ధరలు ఎంత పెరిగినప్పటికీ, భారతీయ వినియోగదారులు ఇప్పటికీ బంగారాన్ని అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తగ్గినా ఆభరణాల విక్రయాలు.. ఎగబాకిన పసిడి నాణేలు, బిస్కట్లు!
నివేదికలోని వివరాల ప్రకారం.. మొత్తం డిమాండ్‌లో అత్యంత కీలకమైన ఆభరణాల (Jewellery) విక్రయాలు 15 శాతం తగ్గి 75.1 టన్నులకు పడిపోయాయి. పసిడి ధరలు విపరీతంగా పెరగడం, పెళ్లిళ్ల సీజన్ ముగియడం మరియు అనవసర కొనుగోళ్లకు స్వస్తి పలకాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రభావం ఆభరణాల విక్రయాలపై పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, మరోవైపు సురక్షిత పెట్టుబడిగా (Safe Haven Investment) భావించే గోల్డ్ బిస్కట్లు, పసిడి నాణేల (Bar and Coin) డిమాండ్ మాత్రం నిలకడగా పెరిగింది. వీటి కొనుగోళ్లు 9 శాతం వృద్ధి చెంది 50.3 టన్నులకు చేరడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు హౌస్‌హోల్డ్ ఇన్వెస్టర్లు ఫిజికల్ గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారని ఇది స్పష్టం చేస్తోంది.

దిగుమతులు, రీసైక్లింగ్ క్షీణత: సుంకాల పెంపే కారణమా?
దిగుమతి సుంకాల పెంపు మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. 2026 మే నెలలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఉన్న దిగుమతి సుంకాన్ని (Import Duty) 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా దేశంలోకి బంగారం దిగుమతులు 23 శాతం తగ్గి 98.1 టన్నులకు పరిమితమయ్యాయి.

అదేవిధంగా, పాత ఆభరణాలను విక్రయించి కొత్తవి కొనుగోలు చేసే రీసైక్లింగ్ (Recycling) ప్రక్రియ కూడా 17 శాతం క్షీణించి 19.2 టన్నులుగా నమోదైంది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు పాత బంగారాన్ని విక్రయించే ధోరణి కనిపిస్తుందని, కానీ ఈసారి వినియోగదారులు రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాతో పాత పసిడిని విక్రయించకుండా తమ వద్దే ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారని డబ్ల్యూజీసీ నివేదిక విశ్లేషించింది.

Tags

Be the first to react

Latest