రూ. 5 లేస్ ప్యాకెట్‌పై కోర్టుకెక్కిన కస్టమర్.. పెప్సికోకు షాక్!

PepsiCo India: లేస్ బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్‌లో తూకం తక్కువగా ఉన్నందుకు ప్రముఖ బహుళజాతి సంస్థ పెప్సికో ఇండియాకు జైపూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ. 8,000 జరిమానా విధించింది. జైపూర్‌కు చెందిన చంద్రమాన్ జలన్ 2020లో కొనుగోలు చేసిన రూ. 5 లేస్ ప్యాకెట్‌పై 15 గ్రాములు అని ఉండగా, లోపల కేవలం 4 గ్రాముల చిప్స్ మాత్రమే ఉన్నట్లు తేలింది. దీనిపై ఆయన వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా, పెప్సికో నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ప్యాకెట్ ధర రూ. 5 ను 6% వడ్డీతో రీఫండ్ చేయడంతో పాటు, మానసిక వేదనకు రూ. 5,000, కోర్టు ఖర్చుల కింద రూ. 3,000 చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

పెప్సికోకు రూ. 8,000 జరిమానా
పెప్సికోకు రూ. 8,000 జరిమానా
  • మానసిక వేదనకు రూ. 5,000, న్యాయ పోరాట ఖర్చులకు రూ. 3,000 చెల్లించాల్సిందే!

  • అతిథులకు వడ్డిస్తుండగా ప్యాకెట్ బరువుపై అనుమానం: తూకంలో తేలిన అసలు నిజం!

  • నెలాఖరులోగా చెల్లించకపోతే రూ. 8,000 పై కూడా 6% వార్షిక వడ్డీ విధింపు!

Business: సాధారణంగా బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ కంటే గాలే ఎక్కువగా ఉంటుందనే విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్ నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఈ సమస్యను కేవలం సరదాగా తీసుకోకుండా, వినియోగదారుడికి జరిగిన మోసాన్ని చట్టబద్ధంగా నిరూపించి న్యాయం సాధించారు రాజస్థాన్‌కు చెందిన ఓ కస్టమర్. ప్యాకెట్‌పై ముద్రించిన నికర బరువు కంటే చాలా తక్కువగా చిప్స్ విక్రయించినందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్'కు (PepsiCo India) జైపూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-II భారీ షాకిచ్చింది.

అతిథులకు వడ్డిస్తుండగా బయటపడ్డ నిర్లక్ష్యం

కేసు వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని అగర్వాల్ ఫార్మ్‌కు చెందిన వ్యాపారి చంద్రమాన్ జలన్ (Chandraman Jalan) 2020 నవంబర్ 10వ తేదీన స్థానిక 'మెట్రో క్యాష్ అండ్ క్యారీ' (Metro Cash & Carry) స్టోర్ నుంచి కొన్ని నిత్యావసర సరుకులతో పాటు రూ. 5 విలువ గల లేస్ (Lay's) చిప్స్ ప్యాకెట్లను కొనుగోలు చేశారు. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆ చిప్స్ వడ్డిస్తున్న సమయంలో ఆ ప్యాకెట్ చాలా తేలికగా అనిపించింది. అనుమానంతో ఆయన దానిని బరువు తూచగా, ప్యాకెట్‌పై 15 గ్రాముల నికర బరువు అని ముద్రించి ఉండగా, లోపల కేవలం 4 గ్రాముల చిప్స్ మాత్రమే ఉన్నట్లు తేలింది. అంటే అందులో ఏకంగా 11 గ్రాముల చిప్స్ లోపించాయి.

నిర్లక్ష్యపు సమాధానం.. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు

ఈ విషయమై చంద్రమాన్ జలన్ వెంటనే సరుకులు కొన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్ యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కేవలం ఐదు రూపాయల విషయమే కదా అని వదిలేయకుండా, వినియోగదారులను మోసం చేసే అన్యాయమైన వాణిజ్య పద్ధతులు (Unfair Trade Practices), సేవా లోపాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. దీనిపై న్యాయవాది మీనాక్షి అగర్వాల్ ద్వారా 2022 ఏప్రిల్ 6న జైపూర్ వినియోగదారుల కమిషన్‌లో అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారు.

విచారణకు డుమ్మా కొట్టిన పెప్సికో.. ఏకపక్ష తీర్పు

ఈ కేసు విచారణలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థ తమ వాదనను వినిపిస్తూ.. సీల్ చేసిన ప్యాకెట్‌లో బరువు తగ్గడం అనేది తయారీ సమయంలో లేదా ప్యాకింగ్ లోపం వల్ల జరిగి ఉంటుందని, రిటైలర్‌గా తమకు ఎలాంటి సంబంధం ఉండదని, తయారీదారు అయిన పెప్సికో మాత్రమే దీనికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కాగా, వినియోగదారుల కమిషన్ పలుమార్లు అధికారిక నోటీసులు జారీ చేసినప్పటికీ పెప్సికో ఇండియా ప్రతినిధులు ఎవరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో కమిషన్ పెప్సికోపై ఏకపక్షంగా (Ex-parte) విచారణను కొనసాగించి తీర్పును ఖరారు చేసింది.

పెప్సికోపై జరిమానా – వినియోగదారుడికి రూ. 8,000 పరిహారం

ఫిర్యాదుదారుడు సమర్పించిన కొనుగోలు ఇన్వాయిస్, ఆధారాలను నిశితంగా పరిశీలించిన కమిషన్.. రిటైలర్ మెట్రో క్యాష్ అండ్ క్యారీపై ఫిర్యాదును కొట్టివేసింది. తయారీ సంస్థ అయిన పెప్సికో ఇండియాదే పూర్తి బాధ్యత అని నిర్ధారిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. లేస్ ప్యాకెట్ ధర రూ. 5 ను ఫిర్యాదు చేసిన తేదీ (ఏప్రిల్ 6, 2022) నుండి చెల్లించే వరకు 6% వార్షిక వడ్డీతో వాపసు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు వినియోగదారుడికి కలిగించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 5,000, న్యాయ పోరాట ఖర్చుల (Litigation Costs) నిమిత్తం మరో రూ. 3,000.. మొత్తంగా రూ. 8,000 ను నెల రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. గడువు దాటితే మొత్తం రూ. 8,000 పై కూడా 6% వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.

Tags

Be the first to react

Latest