పిల్లల్లో తెలుగు భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు ‘తెలుగు బాల పోటీలు’..
వయస్సు ఆధారంగా మూడు విభాగాలుగా..
రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు..
తెలుగు భాషా, సంస్కృతులను తర్వాతి తరాలకు అందించాలనే లక్ష్యంతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘తెలుగు బాల పోటీలు’ నిర్వహిస్తోంది. ఈ సాంస్కృతిక వేడుక 2026 ఏప్రిల్ 11 శనివారం మధ్యాహ్నం 1 గంట నుండి అట్లాంటా సమీపంలోని అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్‌లో జరగనుంది.
ఈ పోటీల ద్వారా విదేశాల్లో పెరుగుతున్న తెలుగు పిల్లల్లో భాషపై ఆసక్తిని పెంపొందించడం, వారి ప్రతిభను వెలికితీయడం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
పోటీలను పిల్లల వయస్సు ఆధారంగా మూడు విభాగాలుగా విభజించారు:
బుడతలు: 5 నుంచి 8 ఏళ్లలోపు
సిసింద్రీలు: 9 నుంచి 12 ఏళ్లలోపు
చిరుతలు: 13 నుంచి 16 ఏళ్లలోపు
చిన్నారులను ఆకట్టుకునేలా విభిన్న రకాల పోటీలు ఏర్పాటు చేశారు:
అక్షరాల అల్లరి: తెలుగు పదాలు చదవడం, రాయడం, అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువదించడం
పద్య ప్రపంచం: పద్యాలను పఠించడం, వాటి అర్థాన్ని వివరించడం
మాటల సందడి: సామాజిక మాధ్యమాలు, కుటుంబ విలువలు లేదా రామాయణం, మహాభారతం పాత్రలపై 2-3 నిమిషాల ప్రసంగం
ఈ పోటీల ద్వారా పిల్లల్లో భాషా పటిమతో పాటు ఆత్మవిశ్వాసం, వేదికపై మాట్లాడే నైపుణ్యాలు కూడా పెరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు
పోటీల్లో పాల్గొనాలనుకునే వారు పోస్టర్‌లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ లేదా QR కోడ్ ద్వారా సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఈ కార్యక్రమాన్ని TAMA అధ్యక్షురాలు సునీత పొట్నూరు మరియు చైర్మన్ మధుకర్ యార్లగడ్డ పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం నరేన్ నల్లూరి లేదా శేఖర్ కొల్లు ను సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు భాషను చిన్నారుల్లో సజీవంగా ఉంచేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఈ పోటీలు పిల్లలకు ఒక మంచి వేదికగా నిలుస్తాయని అట్లాంటా తెలుగు సమాజం అభిప్రాయపడుతోంది.