ఏపీలో 513 మండలాల్లో కరువు ఛాయలు.. 268 మండలాల్లో తీవ్ర పరిస్థితులు!
AP Drought Update 2026: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం ఎక్కువ కాకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఏపీలో వర్షాభావ పరిస్థితులు.. అక్టోబర్ 1న కరువు మండలాల ప్రకటన: సీఎం చంద్రబాబు..
ఏపీలో కరువు అంచనాకు శాస్త్రీయ విధానం.. వర్షపాతం నుంచి శాటిలైట్ చిత్రాల వరకు పరిశీలన..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం ఎక్కువ కాకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ–ఉద్యాన పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులపై ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు.
ఆరు శాఖల సమాచారంతో కరువు అంచనా
కరువు మండలాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఆరు శాఖల నుంచి అందే సమాచారాన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షపాతం, పంటల సాగు పరిస్థితి, భూగర్భ జలాల స్థాయి, నేలలో తేమ శాతం, శాటిలైట్ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వివరాల ఆధారంగా వర్షాభావ తీవ్రతను శాస్త్రీయంగా అంచనా వేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
513 మండలాల్లో కరువు ఛాయలు
2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం 513 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా, మరో 245 మండలాల్లో మోస్తరు స్థాయిలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
కరువు ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే బాధ్యతను వ్యవసాయ శాఖ చేపట్టనుంది. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయి బృందాలు పంట నష్టం, దిగుబడి నష్టాన్ని పరిశీలిస్తాయి. ఈ పరిశీలన అనంతరం వ్యవసాయ శాఖ నివేదికను జిల్లా కలెక్టర్లకు సమర్పించనుంది.
అనంతరం కరువు మండలాల ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్లు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సెప్టెంబర్ 24ను చివరి తేదీగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 29న రాష్ట్ర స్థాయి కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించనుంది. అనంతరం అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఉద్యాన పంటలకు ఎల్‌నినో ముప్పు
వర్షాభావంతో పాటు ఎల్‌నినో ప్రభావం కూడా రాష్ట్రంలోని ఉద్యాన పంటలపై పడే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించామని, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలోని పంటలను హై రిస్క్ కేటగిరీలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో 17,916 హెక్టార్లలో నారింజ, బత్తాయి, మామిడి, ఎర్ర మిరప, ఉల్లి, కూరగాయల పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వివరించారు.
మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత
నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలను కాపాడేందుకు సూక్ష్మ సేద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైతులను మైక్రో ఇరిగేషన్ వైపు మరింతగా ప్రోత్సహించడంతో పాటు ప్రకృతి సేద్యం వైపు కూడా మళ్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (APMIP) కింద రైతులకు సంబంధించిన నాలుగు కీలక సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ సేవలను రైతులకు మరింత చేరువ చేయడం ద్వారా సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తాగునీటికి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు
వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా బోర్లపై ఆధారపడే ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా అదనంగా నీటిని సరఫరా చేయాలని సూచించారు.
విశాఖపట్నం నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి విశాఖ తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
విశాఖ రిజర్వాయర్లపై ప్రత్యేక దృష్టి
విశాఖపట్నం సమీపంలోని రిజర్వాయర్లను నింపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను యుద్ధప్రాతిపదికన పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే మేఘాద్రిగడ్డకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ) నుంచి ప్యాకేజీ నంబర్-8 కింద పైపులైన్ ద్వారా నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం విశాఖ నగరానికి మరో రెండు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయినప్పటికీ భవిష్యత్‌లో ఎలాంటి తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం సూచించారు.
రైతులకు ముందస్తు రక్షణే లక్ష్యం
వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంట నష్టాన్ని తగ్గించడమే కాకుండా రైతులకు అవసరమైన సమయంలో నీరు, సాంకేతిక సహాయం అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరువు మండలాల గుర్తింపుతో పాటు పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, తక్కువ నీటితో సాగును కొనసాగించే పద్ధతులను ప్రోత్సహించడం, ఉద్యాన పంటలను రక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
మరోవైపు తాగునీటి విషయంలోనూ ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల ప్రభావాన్ని వ్యవసాయం, తాగునీటి రంగాలపై వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
Be the first to react