Vijayawada History: బెజవాడ టూ విజయవాడ... పేరు వెనుక ఉన్న 1500 ఏళ్ల అసలు చరిత్ర!
Vijayawada History: విజయవాడ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, అర్జునుడు ఇంద్రకీలాద్రిపై పాశుపతాస్త్రం సాధించడం వల్ల విజయవాటిక (విజయవాడ)గా పేరు వచ్చిందని, సరుకుల (వెచ్చాలు) మార్కెట్ కేంద్రంగా ఉన్నందున వెచ్చవాడ/బెజవాడగా మారిందని తెలుస్తోంది. ఈ నగరం తొలికాలంలో బౌద్ధ, జైన మతాలకు స్థావరంగా ఉండి, కాలక్రమేణా కనకదుర్గమ్మ శక్తి స్థావరంగా, దుర్గామల్లేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
విజయవాడలో జైనరాణి 'నెడుంబి బసది': ప్రాచీన ఆధారాల్లో అంబాపురం ప్రాశస్త్యం.
గొప్ప శక్తి స్థావరం కనకదుర్గమ్మ క్షేత్రం: దుర్గామల్లేశ్వర ఆలయ చారిత్రక నేపథ్యం!
బెజ్జం వేస్తే 'బెజ్జంవాడ' అయిందా?: జానపద కథలపై చరిత్రకారుల స్పష్టత.
Vijayawada History: ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర మరియు మౌలిక వికాసంలో విజయవాడ నగరానికి విశిష్టమైన స్థానం ఉంది. ప్రాచీన కాలం నుండి వర్తక వాణిజ్యాలకు, ఆధ్యాత్మిక సాధనలకు మరియు విభిన్న మతాల సమ్మేళనానికి ఈ నగరం వేదికగా నిలిచింది. ప్రముఖ చరిత్రకారులు మరియు పురావస్తు పరిశోధకులు మరియు చారిత్రక ఆధారాల ప్రకారం విజయవాడ పేరు పరిణామ క్రమం మరియు దాని ప్రాచీన నేపథ్యం కింద విధంగా ఉంది.
విజయవాడ పేరు పరిణామ క్రమం
చారిత్రక శాసనాలను పరిశీలిస్తే ఈ నగరానికి వివిధ కాలాల్లో ఐదు రకాల పేర్లు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాచీన ఆధారాల్లో పెచ్చవాడ, వెచ్చవాడ, బెజవాడ, విజయవాటిక మరియు విజయవాడ అని పేర్కొనబడింది. 1954వ సంవత్సరంలో మున్సిపాలిటీ చేసిన తీర్మానం ద్వారా ఈ నగరానికి అధికారికంగా 'విజయవాడ' అనే పేరు స్థిరపడింది. అయితే, నేటికీ రైల్వే రికార్డుల్లోనూ మరియు ప్రజా వ్యావహారంలోనూ 'బెజవాడ' అనే పేరు ప్రాచుర్యంలో ఉనికిలో ఉంది.
'వెచ్చవాడ' వ్యాపార స్థావరం
ప్రముఖ శాసన పరిశోధకులు పి.వి. పరబ్రహ్మశాస్త్రి గారి పరిశోధనల ప్రకారం, ప్రాచీన కాలంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకుల (వెచ్చాలు) క్రయవిక్రయాలకు ఇది ప్రధాన మార్కెట్ కేంద్రంగా (వాటిక) ఉండేది. అందుచేతనే దీనిని 'పెచ్చవాడ' లేదా 'వెచ్చవాడ' అని పిలిచేవారని, అదే కాలక్రమేణా 'బెజవాడ'గా రూపాంతరం చెందిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఇంద్రకీలాద్రి మరియు అర్జునుడి విజయం
మహాభారత ఇతిహాస నేపథ్యం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడం కోసం అర్జునుడు (విజయుడు) ఇంద్రకీలాద్రి పర్వతంపై పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు కిరాతక రూపంలో వచ్చి అర్జునుడి పరాక్రమాన్ని పరీక్షించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. పాశుపతాస్త్ర సాధనలో 'విజయుడు' (అర్జునుడు) విజయం సాధించిన స్థలం కాబట్టి ఇది 'విజయవాటిక'గా, ఆ తర్వాత 'విజయవాడ'గా ప్రసిద్ధి చెందింది. ఇంద్రకీలాద్రి కింద ఉన్న పార్థేశ్వర స్వామి శాసనాలు ఈ అంశాన్ని బలపరుస్తున్నాయి.
జానపద కథనాలు - బెజ్జంవాడ ప్రచారం
కృష్ణా నది ప్రవాహానికి ఇంద్రకీలాద్రి కొండ అడ్డుగా రాగా, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపి కొండకు బెజ్జం (రంధ్రం) చేశాడని, దాని ద్వారా నీరు ప్రవహించడం వల్ల 'బెజ్జంవాడ' అయిందనే ఒక జానపద కథనం ప్రచారంలో ఉంది. అయితే దీనికి ఎలాంటి సాహిత్య లేదా చారిత్రక శాసన ఆధారాలు లేవని, ఇది కేవలం మౌఖిక ప్రచారం మాత్రమేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
శాసన ఆధారాలు మరియు యుద్ధమల్లుని శాసనం
చారిత్రకంగా 9వ శతాబ్దానికి చెందిన అద్దంకి పండరంగని శాసనంలో కందుకూరును విజయవాడగా మలిచినట్లు ప్రస్తావన ఉంది. అలాగే 10వ శతాబ్దపు తొలికాలం నాటి'బెజవాడ యుద్ధమల్లుని శాసనం' ఈ నగర ప్రాచీనతకు ప్రామాణిక ఆధారంగా నిలుస్తుంది.
బౌద్ధ మత ప్రాభవ కేంద్రం
విజయవాడ ప్రాచీన కాలంలో గొప్ప బౌద్ధ స్థావరంగా విలసిల్లింది. క్రీస్తుశకం 1వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధం విశేషంగా ప్రచారంలో ఉంది. గుణదల గుహలు, మొగలరాజపురం గుహలు, సిద్ధార్థ కాలేజీ ప్రాంతంలోని గుహలు, సీతానగరం మరియు ఉండవల్లి గుహలు మొదట్లో బౌద్ధ భిక్షువులు వర్షాకాలంలో ధ్యానం మరియు మూలికా వైద్యం చేసుకునే 'వర్షావాస' స్థావరాలుగా ఉపయోగపడ్డాయి.
జైన మత ఆనవాళ్లు - నెడుంబి బసది
క్రీస్తుశకం 7వ, 8వ శతాబ్దాలలో విజయవాడ ప్రధాన జైన మత కేంద్రంగా మారింది. తూర్పు చాళుక్య మూలపురుషుడు కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యణదేవి బెజవాడలోని జమ్మిదొడ్డి వద్ద'నెడుంబి బసది' అనే జైన క్షేత్రాన్ని నిర్మించి, దానికి ముసినికొండ గ్రామాన్ని దానంగా ఇచ్చింది. అలాగే జక్కంపూడి సమీపంలోని అంబాపురం కొండలపై ఉన్న గుహల్లో 22వ తీర్థంకరుడైన నేమినాథుడు, 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు మరియు జైన యక్షిణి 'అంబిక' విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి.
వైదిక మత వికాసం
విష్ణుకుండినుల కాలం (క్రీ.శ. 4వ శతాబ్దం) నుండి బ్రాహ్మణీయ వైదిక మతం వ్యాప్తి చెందింది. 6వ శతాబ్దం నాటికి ఉండవల్లి, మొగలరాజపురం గుహలు త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు), అనంతశయనుడు, మహిషాసురమర్దిని మరియు నటరాజ స్వామి ఆలయాలుగా రూపాంతరం చెందాయి. కనకదుర్గమ్మ ఆలయం కింద ఉన్న అక్కన్న-మాదన్న గుహలు కూడా ఈ పరిణామ క్రమానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
కనకదుర్గమ్మ క్షేత్రం - శక్తి స్థావరం
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయం అత్యంత మహిమాన్వితమైన 'శక్తి స్థావరం'గా పేరుగాంచింది. 10వ శతాబ్దం నుండి ఇక్కడ శాక్తం మరియు శైవం కలగలిసి దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంగా పూజలందుకుంటున్నాయి. రథం బజార్ ప్రాంతంలో లభించిన దాదాపు 110 శాసనాలు ఈ క్షేత్ర చారిత్రక ప్రాధాన్యతను నిరూపిస్తున్నాయి.
సంస్కృతుల సమాహారం
మొత్తానికి విజయవాడ నగరం ఏ ఒక్క మతానికో లేదా సంస్కృతికో పరిమితం కాకుండా బౌద్ధం, జైనం, వైదికం, శాక్తం మరియు శైవ మతాల సమాహారంగా వృద్ధి చెందింది. విభిన్న సంస్కృతులు ఒకదానికొకటి గౌరవించుకుంటూ సహజీవనం చేసిన ప్రాచీన సంప్రదాయం విజయవాడ సొంతం.
Tags
Be the first to react