Schengen: అక్రమ వలసల కలకలం.. షెంగెన్ ప్రాంతం నుండి స్పెయిన్ అవుట్?
Schengen: యూరప్‌లో అక్రమ వలసల సమస్య మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తర ఆఫ్రికాలోని స్పెయిన్ భూభాగమైన సెఉటా (Ceuta) ప్రాంతానికి మొరాకో నుంచి ఇటీవల భారీ సంఖ్యలో వలసదారులు చేరుకుంటుండటంతో, స్పెయిన్‌పై యూరప్‌లోని పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే స్పెయిన్‌పై షెంగెన్ సరిహద్దులను తాత్కాలికంగా మూసివేయాలన్న ఇటలీ ప్రతిపాదనకు ఇప్పుడు ఫిన్లాండ్, ఆస్ట్రియా కూడా మద్దతు ప్రకటించాయి.
స్పెయిన్‌పై యూరప్ ఒత్తిడి.. షెంగెన్ సరిహద్దుల మూసివేతకు ఫిన్లాండ్, ఆస్ట్రియా మద్దతు..
మొరాకో నుంచి అక్రమ వలసలు పెరగడంతో యూరప్‌లో వలస సంక్షోభంపై మళ్లీ చర్చ..
యూరప్‌లో అక్రమ వలసల సమస్య మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఉత్తర ఆఫ్రికాలోని స్పెయిన్ భూభాగమైన సెఉటా (Ceuta) ప్రాంతానికి మొరాకో నుంచి ఇటీవల భారీ సంఖ్యలో వలసదారులు చేరుకుంటుండటంతో, స్పెయిన్‌పై యూరప్‌లోని పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే స్పెయిన్‌పై షెంగెన్ (Schengen) సరిహద్దులను తాత్కాలికంగా మూసివేయాలన్న ఇటలీ ప్రతిపాదనకు ఇప్పుడు ఫిన్లాండ్, ఆస్ట్రియా కూడా మద్దతు ప్రకటించాయి.
ఫిన్లాండ్ అంతర్గత వ్యవహారాల మంత్రి మారి రంటానెన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, షెంగెన్ ప్రాంత బాహ్య సరిహద్దులను రక్షించడంలో స్పెయిన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
షెంగెన్ ప్రాంతంలో సభ్యదేశంగా కొనసాగాలంటే ప్రతి దేశం తన బాహ్య సరిహద్దులను సమర్థంగా కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ప్రతిపాదనకు యూరప్ దేశాలన్నీ మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆస్ట్రియా చాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ కూడా స్పెయిన్ పరిస్థితిని "స్పష్టమైన హెచ్చరిక"గా అభివర్ణించారు. అక్రమ వలసలు యూరోపియన్ యూనియన్‌లో చోటు చేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
స్పెయిన్ ప్రభుత్వం తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించి, అక్రమ వలసదారులు యూరప్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అలాగే, ఇటీవల వేలాది మంది అక్రమ వలసదారులకు స్పెయిన్ నివాస అనుమతులు ఇవ్వడం మరింత మంది అక్రమంగా యూరప్‌లోకి రావడానికి ప్రోత్సాహకంగా మారిందని ఆయన విమర్శించారు.
పరిస్థితి మరింత దిగజారితే తమ దేశ సరిహద్దులను రక్షించేందుకు అవసరమైతే షెంగెన్ సరిహద్దులను తాత్కాలికంగా మూసివేసే చర్యలు కూడా తీసుకుంటామని స్టాకర్ హెచ్చరించారు.
ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ గురువారం మాట్లాడుతూ, స్పెయిన్‌తో షెంగెన్ సరిహద్దులను మూసివేయడానికి తాను అనుకూలమని ప్రకటించారు.
ఇటలీ ఉప ప్రధాని మాటియో సాల్విని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని జార్జియా మెలోనీ స్పందిస్తూ, దేశ సరిహద్దులు మరియు ప్రజల భద్రత కోసం అవసరమైతే స్పెయిన్‌తో షెంగెన్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇటలీ నేతల వ్యాఖ్యలపై స్పెయిన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు ఇటలీ రాయబారిని స్పెయిన్ విదేశాంగ శాఖ పిలిపించింది.
మొరాకో నుంచి సెఉటాకు అక్రమ వలసలు పెరగడం యూరప్‌లో వలస విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది. షెంగెన్ ఒప్పందం ప్రకారం సభ్య దేశాల మధ్య స్వేచ్ఛాయుత ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ, బాహ్య సరిహద్దుల భద్రతపై సభ్యదేశాల మధ్య భిన్నాభిప్రాయాలు మరింత స్పష్టమవుతున్నాయి.
ఇప్పుడు ఫిన్లాండ్, ఆస్ట్రియా కూడా ఇటలీ వైఖరికి మద్దతు ఇవ్వడంతో, స్పెయిన్‌పై యూరోపియన్ దేశాల ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశంపై యూరోపియన్ యూనియన్‌లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
Be the first to react