Srikakulam: 2047 నాటికి స్వర్ణ శ్రీకాకుళం.. మహా ప్రణాళిక ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు!

Srikakulam: 2047 నాటికి శ్రీకాకుళం జిల్లాను పేదరికం లేని, స్వయం సమృద్ధి, సాంకేతికత ఆధారిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘స్వర్ణ ఆంధ్ర@2047–స్వర్ణ శ్రీకాకుళం’ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతు సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

Srikakulam Development
Srikakulam Development

శ్రీకాకుళం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. 2047 నాటికి స్వయం సమృద్ధి జిల్లాగా తీర్చిదిద్దుతాం..

రైతు ఆదాయం పెంపే లక్ష్యం.. శ్రీకాకుళంలో వ్యవసాయానికి భారీ ప్రోత్సాహం..

శ్రీకాకుళం: 2047 నాటికి శ్రీకాకుళం జిల్లాను పేదరికం లేని, స్వయం సమృద్ధి, సాంకేతికత ఆధారిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘స్వర్ణ ఆంధ్ర@2047–స్వర్ణ శ్రీకాకుళం’ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రైతు సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన.. వారి ఆశయాలకు అనుగుణంగా దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలకు రూ.1.49 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, విద్యుత్ సబ్సిడీ, తల్లికి వందనం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవ వంటి పథకాల ద్వారా వివిధ వర్గాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.

జిల్లాలో 3,04,352 మంది పింఛనుదారులకు నెలకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ.129.99 కోట్లు అందిస్తున్నట్లు వివరించారు. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్యే ఇంటి వద్ద 90 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు, తీవ్రమైన అనారోగ్యం, అధిక వైకల్యంతో మంచానికే పరిమితమైన వారికి ప్రత్యేక పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు.

విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అన్నారు. తల్లికి వందనం పథకం కింద 2,54,456 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.381.684 కోట్లు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి 8,654 మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించినట్లు చెప్పారు. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో ఉండేలా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

వ్యవసాయ యాంత్రీకరణ, బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఖరీఫ్‌-2026లో ఇప్పటివరకు 1,35,059 హెక్టార్లలో పంటలు సాగయ్యాయని చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు.

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 2026 తొలి విడతలో 2,79,100 మంది రైతులకు రూ.183.61 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం జరగకుండా రైతులకు ముందస్తు సూచనలు ఇస్తున్నామని చెప్పారు. గ్రామ వ్యవసాయ సహాయకుల బృందాలు రైతుల పొలాలకు వెళ్లి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.

నాగావళి, వంశధార, బహుదా నదుల నీటిని సమర్థంగా వినియోగించి జిల్లాలో ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.

నారాయణపురం, మడ్డలవలస జలాశయాల ద్వారా 44,160 ఎకరాలకు, వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1,48,230 ఎకరాలకు, కుడి ప్రధాన కాలువ ద్వారా 63,134 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజీకి రూ.641.10 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఉద్దానం ప్రాంత సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన మహేంద్రతనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులు 55 శాతం పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. సాంకేతిక, భూసేకరణ సమస్యలను అధిగమించి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జూన్ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి సుమారు 26 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యమన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జలధార–జలహారతి కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత కోసం 4,756 ఫీడర్ ఛానళ్లను శుభ్రం చేసి, చెరువుల్లో పూడికతీత, కృత్రిమ రీచార్జ్ పనులు చేపట్టామని తెలిపారు. ఇందుకోసం రూ.205 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

పల్లెపండుగ-1, 2 కార్యక్రమాల కింద గత రెండేళ్లలో రూ.240 కోట్లతో 551 కిలోమీటర్ల మేర 3,300 సీసీ రహదారులు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. మరో రూ.107 కోట్లతో 104 కిలోమీటర్ల మేర 39 బీటీ రహదారులు పూర్తి చేశామని చెప్పారు.

జిల్లా పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు 76 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర వాణిజ్యానికి శ్రీకాకుళం కీలక కేంద్రంగా మారుతుందని అన్నారు. స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.

ఉద్దానం సహా జిల్లా రవాణా రంగంలో మార్పులు తీసుకురావడానికి పలాస పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. భూసేకరణ, సాంకేతిక సాధ్యాసాధ్యాల పరిశీలన కొనసాగుతోందన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మత్స్యకార సేవలో పథకం కింద 16,738 మంది మత్స్యకారులకు 2026-27 వేట నిషేధ భృతిగా ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.32.38 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మత్స్యకారుల బీమా పరిధిని విస్తరించి ప్రమాదవశాత్తు మరణించే కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. 2026-27లో ఇప్పటివరకు రూ.108.20 కోట్ల పెట్టుబడితో 3,617 ఎంఎస్‌ఎంఈల ద్వారా 13,313 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు.

పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ గుర్తింపు తీసుకురావడంతో పాటు నేత కార్మికులకు రాయితీలు, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పొందూరు ఖాదీకి గుర్తింపు తీసుకురావడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

జల జీవన్ మిషన్ కింద జిల్లాలో రూ.2,077 కోట్లతో 4,286 పనులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 1,191 పనులు పూర్తిచేసి 2,38,440 ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించామని చెప్పారు.

మహిళల ఆర్థిక సాధికారతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జిల్లాలో 49,050 స్వయం సహాయక సంఘాల్లో 5,40,726 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజీ ద్వారా 51,943 మంది సభ్యులకు రూ.654.42 కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. ఈ ఏడాది స్త్రీనిధి ద్వారా 24,069 మహిళా సంఘాలకు రూ.227.72 కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు.

‘స్వర్ణ ఆంధ్ర@2047–స్వర్ణ శ్రీకాకుళం’ లక్ష్యం కేవలం అభివృద్ధి కార్యక్రమం కాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, నైపుణ్యాలు–ఉపాధి, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, రైతు–వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, శక్తి–ఇంధన వ్యయ నియంత్రణ, ఉత్పత్తి నాణ్యత, స్వచ్ఛ ఆంధ్ర, డీప్‌టెక్ వంటి పది ప్రాధాన్యతా రంగాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

2047 నాటికి శ్రీకాకుళాన్ని పేదరిక రహిత, స్వయం సమృద్ధి, సాంకేతికత ఆధారిత, పెట్టుబడులకు అనుకూల, విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్న జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest