Pawan Kalyan: రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు.. 5 వేల హస్తకళాకారుల కుటుంబాలకు ఊరట!

Pawan Kalyan: రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలను కాపాడటంతో పాటు కళాకారులకు ముడిసరుకు కొరత లేకుండా చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ప్రారంభించారు.

Pawan Kalyan
Pawan Kalyan

హస్తకళలకు పవన్ కల్యాణ్ అండ.. రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ప్రారంభం..

రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు ప్రారంభం.. పవన్ కల్యాణ్ కీలక చర్య..

రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలను కాపాడటంతో పాటు కళాకారులకు ముడిసరుకు కొరత లేకుండా చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని ఆరు ప్రధాన హస్తకళా క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, మాధవమాల, శెట్టిగుంట కళాకృతులు, బొబ్బిలి వీణలు వంటి సంప్రదాయ కళలకు కలప ప్రధాన ముడిసరుకు. అయితే కలప కొరత కారణంగా కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.

ధవళేశ్వరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల కలప అందుబాటులో ఉంచారు. వచ్చే ఐదేళ్లకు సరిపడా కలపను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

వుడ్ బ్యాంకు ప్రారంభోత్సవం సందర్భంగా పవన్‌ కళ్యాణ్ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనను పరిశీలించారు. వివిధ క్లస్టర్లకు చెందిన కళాకారులు తయారు చేసిన కళాకృతులను ఆయన ఆసక్తిగా చూశారు.

ప్రతి కళాకృతిపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, దానిని తయారు చేసిన కళాకారుడి వివరాలు, తయారీ విధానం గురించి తెలుసుకున్నారు. ప్రతి స్టాల్‌ వద్ద కళాకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాకృతుల తయారీకి ఉపయోగించే కలప, దాని లభ్యతపై కూడా వివరాలు తెలుసుకున్నారు.

వుడ్ బ్యాంకులో నిల్వ చేసిన కలప దుంగలపై కూడా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. వాటిని స్కాన్ చేసిన పవన్‌ కళ్యాణ్.. కలపను ఎక్కడి నుంచి సేకరించారు, ఆ చెట్టు వయస్సు ఎంత, దాని శాస్త్రీయ నామం ఏమిటి వంటి వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇలాంటి డిజిటల్ వివరాల ద్వారా ముడిసరుకు సరఫరాలో పారదర్శకత పెరగడంతో పాటు, కళాకృతుల వెనుక ఉన్న కళాకారుడి శ్రమను వినియోగదారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

కళా ప్రదర్శనను తిలకించిన పవన్‌ కళ్యాణ్, అన్నా కొణిదెలతో కలిసి పలు కళాకృతులను కొనుగోలు చేశారు. సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో భాగంగా కళాకారుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెంచాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వ సంపదగా ఉన్న హస్తకళలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అయితే ముడిసరుకు కొరత, పెరుగుతున్న ఖర్చులు వంటి సమస్యలు కళాకారులకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వుడ్ బ్యాంకుల ఏర్పాటు సంప్రదాయ కళల పరిరక్షణకు కీలక చర్యగా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్‌, హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌, నీటిపారుదల సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ పాల్గొన్నారు.

అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ జ్యోతి, కన్జర్వేటర్ ఎన్. నాగేశ్వరరావుతో పాటు ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest