Kondapalli Srinivas: ‘స్వర్ణాంధ్ర @2047’కు ఎంఎస్‌ఎంఈలే కీలకం.. మంత్రి కొండపల్లి కీలక వ్యాఖ్యలు!
Kondapalli Srinivas: చిన్న పరిశ్రమలు బలపడితేనే దేశం, రాష్ట్రం నిర్దేశించుకున్న 2047 అభివృద్ధి లక్ష్యాలను సాధించగలమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. యువత, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.
ఎంఎస్‌ఎంఈల పటిష్టతతోనే 2047 లక్ష్యాలు సాధ్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
స్థానిక పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్లు.. ఇండియా-ఈయూ ఎఫ్‌టీఏపై మంత్రి ఫోకస్..
అమరావతి: చిన్న పరిశ్రమలు బలపడితేనే దేశం, రాష్ట్రం నిర్దేశించుకున్న 2047 అభివృద్ధి లక్ష్యాలను సాధించగలమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. యువత, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.
చెన్నైలోని హోటల్ లీలా ప్యాలెస్‌లో మంగళవారం దక్షిణ భారత చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SICCI) 116వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. దక్షిణ భారత వ్యాపార, ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏపీలో ఎంఎస్‌ఎంఈలకు అనుకూల వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహకారం అందిస్తూ అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి తెలిపారు.
పారిశ్రామిక పార్కులు, ఉమ్మడి వసతులు, ఆర్థిక సహాయం వంటి చర్యల ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.
ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లు
ఏపీలో తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఇండియా–యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) ద్వారా లభించే అవకాశాలను ఉపయోగించుకోవడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం ఏర్పడితే ఎగుమతులు పెరగడంతో పాటు చిన్న పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
2047 లక్ష్యాల్లో ఎంఎస్‌ఎంఈలదే కీలక పాత్ర
SICCI అధ్యక్షుడు అరుణ్ అలగప్పన్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం సాధించాలనుకుంటున్న అభివృద్ధి లక్ష్యాలు చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రగతిపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
తమిళనాడు లక్ష్యంగా పెట్టుకున్న ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ నిర్దేశించుకున్న ‘స్వర్ణాంధ్ర @2047’ లక్ష్యాల సాధనలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. చిన్న పరిశ్రమలు విస్తరించినప్పుడే స్థానికంగా ఉపాధి, పెట్టుబడులు, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు
సమావేశంలో విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కూడా సత్కరించారు. మద్రాస్ యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, లయోలా ఇన్‌స్టిట్యూట్, త్యాగరాజ కాలేజ్, భారతిదాసన్ యూనివర్సిటీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
విద్య, పరిశ్రమ, పెట్టుబడులు, ఉపాధి రంగాలు పరస్పరం అనుసంధానమైతేనే దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం SICCI సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.ఎన్. శివ శంకర్ ధన్యవాదాలతో ముగిసింది.
Tags
Be the first to react