Polavaram: ఉత్తరాంధ్రకు గోదావరి జలాల బాట.. పోలవరం ఎడమ కాలువ నుంచి నీటి విడుదల!
Polavaram: ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలు రేపు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్‌ను ఆన్ చేసి, జలహారతి ఇచ్చి గోదావరి నీటికి స్వాగతం పలకనున్నారు. ఈ నీటితో ఉత్తరాంధ్రలో సాగు, తాగునీటి అవసరాలకు మరింత భరోసా కలగనుంది.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల పరుగులు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విడుదల..
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త భరోసా.. 5.23 లక్షల మందికి తాగునీరు..
అమరావతి: ఉత్తరాంధ్ర సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలు రేపు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్‌ను ఆన్ చేసి, జలహారతి ఇచ్చి గోదావరి నీటికి స్వాగతం పలకనున్నారు. ఈ నీటితో ఉత్తరాంధ్రలో సాగు, తాగునీటి అవసరాలకు మరింత భరోసా కలగనుంది.
నాలుగు జిల్లాలకు సాగు, తాగునీటి ప్రయోజనం
పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు విడుదల కావడంతో నాలుగు జిల్లాల్లోని వివిధ ఆయకట్టు ప్రాంతాలకు ప్రయోజనం కలగనుంది. మొత్తం 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 5.23 లక్షల మందికి తాగునీరు అందే అవకాశం ఉంది.
ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటితోనే అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. పాయకరావుపేట అక్విడెక్ట్ నుంచి వచ్చే నీటిని అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.
క్లిష్టమైన ప్రాంతాలను దాటిన లెఫ్ట్ మెయిన్ కెనాల్
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం అంత సులభంగా సాగలేదు. తూర్పు కనుమలు, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను దాటుకుంటూ కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటేలా ప్రత్యేక ఇంజినీరింగ్ పరిష్కారాలను అమలు చేశారు.
కాలువ నిర్మాణంలో అవసరమైన చోట్ల సైఫన్లు, అక్విడెక్టులు నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో నదీ ప్రవాహానికి ఎగువ నుంచి, మరికొన్ని చోట్ల ప్రవాహానికి దిగువ నుంచి కాలువను నిర్మించారు. ఏలేరు నది బెడ్ లెవల్‌కు దిగువనుంచి గోదావరి నీటిని తరలించేందుకు సైఫన్ నిర్మించారు. పంపా నదిపై ఎగువ నుంచి అక్విడెక్ట్ నిర్మించి నీటి ప్రవాహానికి మార్గం సుగమం చేశారు.
పంపా అక్విడెక్ట్ పునాదుల కోసం 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్ ఏర్పాటు చేశారు. తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవైన అక్విడెక్ట్ నిర్మించారు. ఇది 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా రూపొందించారు.
రూ.4,192 కోట్లతో నిర్మాణం
పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తం రూ.4,192 కోట్లు ఖర్చు చేశారు. తాళ్లపాలెం వద్ద దీర్ఘకాలంగా కొనసాగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.
తొలిదశలో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. ఏలేరు ఆయకట్టు కింద 80,700 ఎకరాలు, పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాలు స్థిరీకరించేందుకు నీటి సదుపాయం కల్పించనున్నారు. అలాగే తాండవ, వరాహ, మామిడి గెడ్డ పరిధిలో మరో 46,620 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రయోజనం కలగనుంది.
23.44 టీఎంసీల గోదావరి జలాలకు మార్గం
పోలవరం ఎడమ కాలువ ద్వారా మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నీటిని సాగు, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
మొత్తం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎడమ కాలువను నిర్మిస్తున్నారు. తాగునీటి కాలువలను కలుపుకుంటే పోలవరం ఎడమ కాలువ నిర్మాణం మొత్తం 213 కిలోమీటర్ల మేర కొనసాగుతోంది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం
పోలవరం ఎడమ కాలువను భవిష్యత్తులో మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ అనుసంధానం పూర్తయితే అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు కూడా గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంటుంది.
పోలవరం ఎడమ కాలువ–ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనుసంధానం ద్వారా భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
గోదావరి నీరు ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టడం కేవలం ఒక నీటి విడుదల కార్యక్రమంగా కాకుండా, రైతులకు సాగునీటి భరోసా, ప్రజలకు తాగునీటి భద్రత, పరిశ్రమలకు నీటి వనరుల విస్తరణకు కీలక ముందడుగుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.
Be the first to react