Minister Sandhyarani: గిరిజన హక్కులకు భంగం కలగకుండా బలమైన చట్టం తీసుకొస్తాం.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు!

Minister Sandhyarani: గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు, జీవో నంబర్-3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జీవో-3ను యథాతథంగా పునరుద్ధరించడం కాకుండా, న్యాయస్థానాల్లోనూ నిలిచేలా శాశ్వత పరిష్కారంతో కూడిన బలమైన చట్టాన్ని తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె వెల్లడించారు.

Minister Sandhyarani
Minister Sandhyarani

జీవో-3పై గిరిజన సంఘాలతో మంత్రి సంధ్యారాణి కీలక సమావేశం..

గిరిజనుల ఉద్యోగ హక్కులకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..

విజయవాడ: గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు, జీవో నంబర్-3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జీవో-3ను యథాతథంగా పునరుద్ధరించడం కాకుండా, న్యాయస్థానాల్లోనూ నిలిచేలా శాశ్వత పరిష్కారంతో కూడిన బలమైన చట్టాన్ని తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె వెల్లడించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 40 గిరిజన సంఘాల ప్రతినిధులు, ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్, డైరెక్టర్ సదా భార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో జీవో-3 అమలు, 1/70 చట్టం, గిరిజన భూహక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. గిరిజన సంఘాల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు, అభ్యర్థనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి, జీవో-3 పునరుద్ధరణ విషయంలో కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ వ్యతిరేకంగా లేరని స్పష్టం చేశారు. గిరిజనులకు శాశ్వత న్యాయం జరిగేలా చట్టబద్ధమైన, న్యాయపరంగా బలమైన పరిష్కారాన్ని తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.

జీవో-3 చరిత్రను వివరిస్తూ మంత్రి మాట్లాడుతూ, 1986లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవో-275 ద్వారా గిరిజనులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారని గుర్తుచేశారు. అనంతరం 2000లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో-3ను తీసుకువచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం స్థానిక గిరిజనులకే కేటాయించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

జీవో-3 రద్దుకు గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని మంత్రి విమర్శించారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడం వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గిరిజనులు ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలిపించినప్పటికీ, వారి హక్కుల పరిరక్షణలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

రద్దయిన జీవోను యథాతథంగా తిరిగి జారీ చేస్తే అది న్యాయస్థానాల్లో నిలవదని, అందుకే చట్టపరమైన సవరణలతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఇందుకోసం 9 ఐటీడీఏల పరిధిలో సమావేశాలు నిర్వహించి గిరిజన సంఘాలు, జేఏసీలు, మేధావుల అభిప్రాయాలను సేకరించినట్లు వెల్లడించారు. ఈసారి తీసుకొచ్చే చట్టం కోర్టుల్లోనూ నిలిచేలా అందరూ సహకరించాలని ఆమె కోరారు.

గిరిజనుల భూహక్కులను రక్షించే 1/70 చట్టం వారి ప్రాథమిక హక్కు అని, దానిని ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయబోదని మంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను గిరిజనులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, 50 ఏళ్లకే గిరిజనులకు పింఛన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేస్తూ విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.

అమాయక గిరిజన యువతను ప్రలోభపెట్టి రోడ్లపైకి తీసుకురావడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. అలాంటి ప్రచారాలను నమ్మవద్దని గిరిజనులకు విజ్ఞప్తి చేస్తూ, వారి హక్కులు, సంక్షేమం, భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని పునరుద్ఘాటించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శిరీషా దేవి, తోయక జగదీశ్వరి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ట్రైకార్ చైర్మన్ బి. శ్రీనివాసులు, దొందు దొర, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest