Pawan Kalyan: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలి.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు!
Pawan Kalyan: రాష్ట్ర తీర ప్రాంతాలను వాతావరణ మార్పుల ప్రభావం, సముద్ర కోతలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేందుకు చేపట్టిన ప్రతిష్ఠాత్మక "గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్‌కు ఊపందించండి.. రెండు నెలల్లో లక్ష్యాలు పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్..
మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం.. మరింత వేగం పెంచాలని పవన్ కళ్యాణ్..
అమరావతి: రాష్ట్ర తీర ప్రాంతాలను వాతావరణ మార్పుల ప్రభావం, సముద్ర కోతలు, ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేందుకు చేపట్టిన ప్రతిష్ఠాత్మక "గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. 2026-27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
సోమవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు పురోగతిని జిల్లా, డివిజన్ వారీగా సమీక్షించారు. ఇప్పటివరకు ఎంత మేర మొక్కలు నాటారు, ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో మడ అడవులు, తాటి వనాలు అభివృద్ధి చేయనున్నారనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం
గత రెండేళ్లలో రాష్ట్రం మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. 2024-25లో సుమారు 740 హెక్టార్లు, 2025-26లో 1,930 హెక్టార్లలో మడ అడవుల విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, పర్యావరణ నిపుణులను అభినందించారు.
ఈ ఏడాది కూడా మరింత బాధ్యతగా మడ అడవుల విస్తరణ చేపట్టాలని సూచించిన ఆయన, MISHTI-II పథకం కింద నవంబర్, డిసెంబర్ నెలల్లో 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి ఐదు కిలోమీటర్ల వెడల్పుతో పచ్చదన రక్షణ గోడను ఏర్పాటు చేయడమే గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ వివరించారు.
ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అనుకూల వాతావరణంలో కొంత మేర మొక్కల నాటకం పూర్తయిందని, ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో తాటి విత్తనాల సేకరణ, నాటకం వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
5 వేల హెక్టార్లలో తాటి వనాలు
ఈ ఏడాది సుమారు 5,000 హెక్టార్లలో తాటి వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాటి వనాలు, సామాజిక వనాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
తీర జిల్లాలకు అదనంగా 70 లక్షల మొక్కలు
వీబీజీ రాం జీ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు అదనంగా 70 లక్షల మొక్కలు కేటాయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వీటిని సుమారు 2,500 హెక్టార్లలో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
అదేవిధంగా 48 హెక్టార్లలో పరిహార అటవీకరణ, 1,993 హెక్టార్లలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద దేశీయ మొక్కల నాటకం, 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
జిల్లాల వారీ లక్ష్యాలు
రాజమహేంద్రవరం సర్కిల్‌లో 3,243 హెక్టార్లు, గుంటూరు సర్కిల్‌లో 1,832 హెక్టార్లు, విశాఖ సర్కిల్‌లో 1,764 హెక్టార్లలో అటవీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు.
ప్రజల భాగస్వామ్యంతో మూడు అంచెల రక్షణ వ్యవస్థ
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తీర ప్రాంతానికి మూడు అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదటి అంచెలో మడ అడవులు, షెల్టర్ బెల్ట్‌లను అభివృద్ధి చేయగా, రెండో, మూడో అంచెల్లో గ్రామ వనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాలను ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, వర్షపాతం, పర్యావరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ గ్రీనింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే దిశగా ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి దీర్ఘకాలిక రక్షణ కవచంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags
Be the first to react