Minister Savitha: 'టెంకాయ కొట్టింది మేమే.. గుమ్మడికాయ కొట్టింది మేమే'.. భోగాపురంపై మంత్రి సవిత వ్యాఖ్యలు!

Minister Savitha: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తామేనని, ప్రారంభోత్సవం కూడా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గత ప్రభుత్వానికి విధ్వంసం తప్ప అభివృద్ధి అనే భావనే లేదని ఆమె విమర్శించారు.

Minister Savitha
Minister Savitha

భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ మాదే.. జగన్‌పై మంత్రి సవిత విమర్శలు..

పెనుకొండలో బీసీ గురుకుల పాఠశాల ప్రారంభం.. బీసీల విద్యకు ప్రాధాన్యం: మంత్రి సవిత..

పెనుకొండ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తామేనని, ప్రారంభోత్సవం కూడా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గత ప్రభుత్వానికి విధ్వంసం తప్ప అభివృద్ధి అనే భావనే లేదని ఆమె విమర్శించారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో, అలాగే మీడియాతో మాట్లాడిన ఆమె ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాలను వివరించారు.

బీసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నాణ్యమైన విద్యే మార్గమని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తోందని మంత్రి సవిత తెలిపారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నామని చెప్పారు.

ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభించినట్లు వెల్లడించారు. అందులో భాగంగానే పెనుకొండలో బీసీ బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించామని తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొత్తం 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది ఆరు బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

పెనుకొండ నియోజకవర్గంలో గురుకులాలు, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. రూ.3 కోట్లతో కేజీవీబీ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని, రొద్దం, గోరంట్ల, సోమందేపల్లిలో బీసీ హాస్టళ్లు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే పెనుకొండలో ఎస్సీ గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గురుకుల విద్యార్థులకు ఇప్పటికే ట్రాక్‌సూట్లు, స్పోర్ట్స్ షూస్ అందించామని, త్వరలో స్పోర్ట్స్ కిట్లు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్ల మధ్య ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని మంత్రి పేర్కొన్నారు.

'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే విద్యార్థులకు విద్యా మిత్ర కిట్లు కూడా అందజేస్తున్నామని తెలిపారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, భద్రత కల్పిస్తున్నామని, విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తమ ప్రభుత్వానిదేనని మంత్రి సవిత మరోసారి స్పష్టం చేశారు. "భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి టెంకాయ కొట్టింది మేమే... ప్రారంభోత్సవ గుమ్మడి కొట్టింది కూడా మేమే. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు" అని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించకుండా, నిందితులను పరామర్శించే రాజకీయ సంస్కృతి గత ప్రభుత్వానిదేనని ఆరోపించారు. అన్న క్యాంటీన్లను మూసివేయడం, అమరావతిని నిర్లక్ష్యం చేయడం, రాజధానిని మూడు ముక్కలు చేయడం, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలన్నీ గత ప్రభుత్వ క్రెడిట్‌లేనని విమర్శించారు.

"మాకు అలాంటి క్రెడిట్ అవసరం లేదు. మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. క్రెడిట్ చోరీలకు కేరాఫ్ అడ్రస్ జగన్" అని మంత్రి సవిత వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వెంకటరమణ, స్వప్న, ఆర్డీవో ఆనందరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు నాణ్యమైన విద్య, వసతి, క్రీడా సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తును బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత మరోసారి స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest