Low-Cost Rice: తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల్లో ప్రత్యేక కౌంటర్లు!
Low-Cost Rice: సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అమలు చేసింది. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకు బియ్యం విక్రయాలను ఆదివారం ఘనంగా ప్రారంభించింది.
ప్రజలకు ఊరట.. మార్కెట్ కంటే తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం..
విజయవాడలో తక్కువ ధర బియ్యం విక్రయాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్..
సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అమలు చేసింది. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకు బియ్యం విక్రయాలను ఆదివారం ఘనంగా ప్రారంభించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో ఈ కార్యక్రమం ఒకేసారి 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ప్రారంభమైంది.
విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్‌లో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు స్వయంగా తక్కువ ధరకు బియ్యాన్ని అందజేసి ఈ పథకాన్ని ప్రారంభించారు.
మార్కెట్ ధరల కంటే తక్కువకే బియ్యం
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలోకు రూ.52, బీపీటీ రా రైస్‌ను కిలోకు రూ.50 ధరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం రూ.62 నుంచి రూ.65 వరకు, బీపీటీ రా రైస్ రూ.58 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్కువ ధరలకు అందించడం వినియోగదారులకు ఊరటనివ్వనుంది.
ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి వ్యక్తికి గరిష్టంగా 10 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
ప్రజలకు భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరల మార్పులను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోందన్నారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ముందస్తు చర్యగా రైస్ మిల్లర్లతో చర్చించి తక్కువ ధరలకు బియ్యం అందించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారం ప్రశంసనీయమని పేర్కొన్న మంత్రి, ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా
ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్‌ను కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే ముందు వాటిని గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టడం తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఈ ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ నూపుర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించడం మాత్రమే కాకుండా, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కూడా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Tags
Be the first to react