Flood Alert: వరదలపై ఏఐ కవచం.. విజయవాడలో ‘సిటీ ఫ్లడ్ అలర్ట్’ ప్రారంభం!
Flood Alert: వర్షాకాలంలో పట్టణాలను ముంచెత్తే ఆకస్మిక వరదలను ముందుగానే గుర్తించి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ‘సిటీ ఫ్లడ్ అలర్ట్’ వ్యవస్థను విజయవాడలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
బుడమేరు వరదలకు చెక్.. ఏఐతో ముందస్తు హెచ్చరికల వ్యవస్థ..
48 గంటల ముందే భారీ వర్షాల హెచ్చరిక.. ఆకస్మిక వరదలకు 6 గంటల ముందే అలర్ట్..
విజయవాడ: వర్షాకాలంలో పట్టణాలను ముంచెత్తే ఆకస్మిక వరదలను ముందుగానే గుర్తించి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ‘సిటీ ఫ్లడ్ అలర్ట్’ వ్యవస్థను విజయవాడలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట బుడమేరు వాగు వరదల ప్రభావం ఎక్కువగా ఉండే విజయవాడలో అమలు చేసి, అనంతరం రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు (ULBs) ఈ వ్యవస్థను విస్తరించనుంది.
ఈ ప్రాజెక్టును రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS)లోని AWARE విభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA), అలాగే ఐఐటీ గాంధీనగర్కు చెందిన జలవిజ్ఞాన నిపుణుల సహకారంతో రూపొందించింది. విపత్తు సంభవించిన తర్వాత సహాయక చర్యలు చేపట్టే విధానానికి బదులుగా, ముందస్తు అంచనాల ఆధారంగా చర్యలు తీసుకునే విధానానికి ఇది నాంది పలుకుతోంది.
‘సిటీ ఫ్లడ్ అలర్ట్’ వ్యవస్థ ద్వారా భారీ వర్షాలపై 48 గంటల ముందుగానే హెచ్చరికలు అందుతాయి. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని 6 గంటల ముందే గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తుంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, ట్రాఫిక్ మళ్లింపు వంటి చర్యలను ముందుగానే చేపట్టే అవకాశం ఉంటుంది.
విజయవాడలో ప్రతి సంవత్సరం బుడమేరు వాగు ఉప్పొంగడంతో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించారు. నగరాన్ని వార్డుల వారీగా అత్యాధునిక ఉపగ్రహ చిత్రాల ఆధారంగా డిజిటల్ ఎలివేషన్ మోడల్ (DEM) సాంకేతికతతో మ్యాపింగ్ చేశారు. భూభాగం ఎత్తు, సహజ నీటి ప్రవాహ మార్గాలు, లోతట్టు ప్రాంతాల వివరాలను అత్యంత కచ్చితత్వంతో నమోదు చేశారు.
బుడమేరు వరదలకు సంబంధించిన దాదాపు 30 ఏళ్ల చారిత్రక సమాచారాన్ని ఏఐ మోడల్‌లో పొందుపరిచారు. వివిధ వర్షపాతం పరిస్థితుల్లో వరద నీరు ఏ మార్గంలో ప్రవహిస్తుంది, ఎక్కడ నిల్వ అవుతుంది, ఏ ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందో ముందుగానే అంచనా వేయగల సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది.
ఈ వ్యవస్థ కేవలం నీటి మట్టాన్ని మాత్రమే అంచనా వేయదు. భూగర్భ, ఉపరితల డ్రైనేజీ వ్యవస్థల్లో ఎక్కడ పూడిక పేరుకుపోయిందో కూడా గుర్తిస్తుంది. దీంతో మున్సిపల్ సిబ్బంది ప్రమాదకర ప్రాంతాల్లో ముందుగానే పూడిక తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోగలరు.
వరద ముప్పును గుర్తించిన వెంటనే ఈ ప్లాట్‌ఫారమ్ ఆటోమేటిక్‌గా హెచ్చరికలను రూపొందించి APSDMAకు పంపిస్తుంది. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు స్థాయి అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలకు వెంటనే సమాచారం చేరుతుంది. దీనివల్ల కాల్వల శుభ్రపరిచే పనులు, డీవాటరింగ్ పంపుల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపు, లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు వంటి చర్యలు వేగంగా అమలు చేయవచ్చు.
విజయవాడలో విజయవంతంగా అమలైన తర్వాత రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు ఈ వ్యవస్థను విస్తరించనున్నారు. ప్రతి నగరం, పట్టణానికి ప్రత్యేక డిజిటల్ భూపటాలు, వరద ప్రమాద మ్యాపింగ్ రూపొందించి పరస్పరం అనుసంధానమైన ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వ్యవస్థకు ఆధారం ‘ఫ్లడ్ ఆస్ట్రా’ (Flood Astra) అనే పట్టణ వరదల అంచనా మోడల్. దీనిని ఐఐటీ గాంధీనగర్ శాస్త్రవేత్తలు గతంలో గురుగ్రామ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అదే సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTGS-AWARE వ్యవస్థకు అనుగుణంగా మెరుగుపరచి, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేసింది.
సాంకేతికతను ప్రజల భద్రత కోసం సమర్థంగా వినియోగించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ‘సిటీ ఫ్లడ్ అలర్ట్’ కీలక అడుగుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో వరదల ప్రభావాన్ని తగ్గించడంలో ఈ వ్యవస్థ రాష్ట్రానికి మరింత బలమైన రక్షణ కవచంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tags
Be the first to react