Thalli–Bidda Express: మాతా–శిశు సంక్షేమానికి మరో ముందడుగు.. త్వరలో 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు అందుబాటులోకి!
Thalli–Bidda Express: గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించి, వాటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, బ్రాండింగ్ నమూనాలను సమీక్షించారు.
బాలింతలు, గర్భిణులకు ఉచిత రవాణా.. ఏపీలో 500 ప్రత్యేక వాహనాలు..
ఏటా 2.75 లక్షల మంది బాలింతలకు ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు..
అమరావతి: గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త వాహనాలను సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించి, వాటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, బ్రాండింగ్ నమూనాలను సమీక్షించారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా రూపొందించిన వాహనాల బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తల్లీ–బిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతి అంశాన్ని అధికారులు రూపొందించిన విధానాన్ని ఆయన పరిశీలించారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, వారితో వచ్చే సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చే సేవలు అందించనున్నారు. అలాగే అధిక ప్రమాద గర్భిణులు (హైరిస్క్ ప్రెగ్నెన్సీలు), తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా ఈ వాహనాలను వినియోగించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా 500 ఎస్‌యూవీ, ఎంయూవీ వాహనాలు ఈ సేవల కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ సేవల ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది బాలింతలు, గర్భిణులు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తల్లి, శిశువు ప్రయాణం సురక్షితంగా ఉండేలా ప్రతి వాహనంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వెనుక సీట్లకు సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కేందుకు ఫుట్‌రెస్ట్, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చే ఎయిర్ కండిషనింగ్, అత్యవసర పరిస్థితుల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచారు.
అదనంగా ప్రతి వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రియల్‌టైమ్‌లో వాహనాల కదలికలను పర్యవేక్షించే అవకాశం కల్పించారు. దీంతో సేవలు పారదర్శకంగా, సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
వాహనాల పరిశీలన సందర్భంగా అధికారులు కార్యక్రమం అమలు విధానం, వాహనాల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా సేవల విస్తరణపై ముఖ్యమంత్రికి వివరించారు. అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసిన అనంతరం ఈ వాహనాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) అధికారులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాతా–శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ మరో కీలక అడుగుగా నిలవనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Be the first to react
