Swatcha Andhra: స్వర్ణాంధ్ర లక్ష్యానికి ప్రజల భాగస్వామ్యమే బలం.. ‘స్వచ్ఛ రక్షణ’ కార్యక్రమాల్లో వాణిజ్య సంస్థల భాగస్వామ్యంపై దృష్టి!
Swatcha Andhra: రాష్ట్రాన్ని పరిశుభ్రతలో ఆదర్శంగా నిలబెట్టాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లాలని సంస్థ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులకు, భాగస్వామ్య సంస్థలకు సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాలు ప్రభుత్వ శాఖలకే పరిమితం కాకుండా వ్యాపార సంస్థలు, హోటల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, నివాస కాలనీల సంక్షేమ సంఘాలు, సామాజిక సేవా సంస్థలు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్యానికి ప్రజల భాగస్వామ్యమే కీలకం: పట్టాభిరామ్..
వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి.. ఏజెన్సీలకు స్వచ్ఛ ఆంధ్ర ఆదేశం..
అమరావతి: రాష్ట్రాన్ని పరిశుభ్రతలో ఆదర్శంగా నిలబెట్టాలనే లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లాలని సంస్థ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులకు, భాగస్వామ్య సంస్థలకు సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాలు ప్రభుత్వ శాఖలకే పరిమితం కాకుండా వ్యాపార సంస్థలు, హోటల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, నివాస కాలనీల సంక్షేమ సంఘాలు, సామాజిక సేవా సంస్థలు కూడా చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఐఐఎల్ఎస్‌జీ (AIILSG), సాహస్ (Saahas), వాష్ ఇన్‌స్టిట్యూట్ (WASH Institute) సంస్థలు అమలు చేస్తున్న సామర్థ్యాభివృద్ధి (Capacity Building–CB), సమాచార–విద్య–ప్రచార (IEC) కార్యక్రమాల పురోగతిని చైర్మన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పట్టాభిరామ్, చాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు వంటి సంస్థలను ‘స్వచ్ఛ రక్షణ’ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు పరిశుభ్రత బాధ్యతను పంచుకున్నప్పుడే ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులకు నిర్వహించే కొన్ని అవగాహన కార్యక్రమాల్లో తాను కూడా ప్రత్యక్షంగా పాల్గొంటానని తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై శాశ్వతమైన అవగాహన పెంపొందించేందుకు మరిన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
స్వచ్ఛత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి యాక్షన్ ప్లాన్‌ను, కార్యాచరణ వివరాలను వారం రోజుల్లో సమర్పించాలని చైర్మన్ ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలాఖరులోగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలను పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
సమీక్ష సందర్భంగా వాష్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు గత పది నెలలుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు నాలెడ్జ్ పార్ట్‌నర్గా అందిస్తున్న సేవలను వివరించారు.
రాష్ట్రంలోని 53 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) ఇప్పటివరకు 923 ఐఈసీ కార్యక్రమాలు నిర్వహించగా, వాటి ద్వారా 3.38 లక్షల మందికి పైగా పౌరులకు పరిశుభ్రత, వ్యర్థాల వేరు చేయడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
వాష్ ఇన్‌స్టిట్యూట్, సాహస్ సంస్థలు సంయుక్తంగా గత పది నెలల్లో 432 సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, 29,339 మందికి పైగా ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు వెల్లడించారు. ఈ శిక్షణల ద్వారా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా మారిందని వివరించారు.
ఏఐఐఎల్ఎస్‌జీ ప్రతినిధులు రాష్ట్రంలో 20 మున్సిపల్ కార్యాలయాలు ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మారినట్లు తెలిపారు. మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, రైల్వే స్టేషన్లలో ‘స్వచ్ఛ రక్షణ’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 70 పట్టణ స్థానిక సంస్థల్లో 28,229 మందికి శిక్షణ అందించినట్లు వెల్లడించారు.
ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా మార్చడం, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వ్యాపార, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని ముందుకు సాగడమే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని సమావేశంలో స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
Tags
Be the first to react