Minister-Savitha: పరిశ్రమలతో స్థానిక యువతకు ఉద్యోగాలు.. గీత కార్మికులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు!

Minister-Savitha: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు వేగవంతం చేయడం ద్వారా యువతకు వారి స్వస్థలాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. విద్య పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ఆమె తెలిపారు.

Minister Savitha
Minister Savitha

రాష్ట్రవ్యాప్తంగా నీరా యూనిట్లు.. గీత కార్మికులకు వ్యాపార అవకాశాలు..

బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ.. ఉన్నత ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం..

హిందూపురం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు వేగవంతం చేయడం ద్వారా యువతకు వారి స్వస్థలాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. విద్య పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ఆమె తెలిపారు.

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన ఈడిగ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవిష్యత్‌లో నిరుద్యోగ సమస్యను గణనీయంగా తగ్గిస్తాయని ఆమె పేర్కొన్నారు.

బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత చెప్పారు. సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, గ్రూప్-2తో పాటు ఇతర పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో నీరా యూనిట్లను ఏర్పాటు చేసి గీత కార్మికులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిందని, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికులకు పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.

హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి చిరస్మరణీయ స్థలమని మంత్రి సవిత అన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు, ప్రస్తుతం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని చెప్పారు. బాలకృష్ణ కృషితో నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఈడిగ విద్యార్థులకు మంత్రి సవిత పురస్కారాలు అందజేశారు.

ఇంటర్‌లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల చొప్పున, 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన వారికి రూ.8 వేల చొప్పున ప్రోత్సాహక నగదు అందించారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహూకరించారు.

టెన్త్‌లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున, తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించారు. 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.3 వేల చొప్పున ప్రోత్సాహకం ఇచ్చారు.

విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయి దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఈడిగ సామాజిక సంక్షేమ సంఘ ప్రతినిధులను ఆమె అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ హరికృష్ణ, గోపాల్, మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య గౌడ్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఈడిగ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest