AP Crime News: రెండు మేక పిల్లల కోసం దారుణ హత్య.. నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన ఘటన! గ్రామ పెద్ద అరెస్ట్!
AP Crime News: నెల్లూరు జిల్లా కావలిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. రెండు మేక పిల్లల పంపకం విషయంలో మొదలైన ఓ చిన్న గొడవ, చిలికి చిలికి గాలివానగా మారి ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ హత్య కేసులో గ్రామ పెద్ద, మాజీ సర్పంచే ప్రధాన నిందితుడిగా ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది.
- Andhrapradesh: మాజీ సర్పంచ్‌తో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- పంచాయితీ పెట్టిన మాజీ సర్పంచే నిందితుడిగా ఆరోపణ..
AP Nellore Crime News: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore District) కావలి నియోజకవర్గంలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగుచూసింది. కేవలం రెండు మేక పిల్లల పంపకం విషయంలో మొదలైన ఒక చిన్న వివాదం, చిలికి చిలికి గాలివానగా మారి ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దారుణ హత్య కేసులో (Kavali Murder Case) గ్రామ పెద్ద, మాజీ సర్పంచే ప్రధాన నిందితుడిగా ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అసలు ఏం జరిగింది? వివాదానికి కారణమిదే!
పోలీసుల కథనం ప్రకారం.. కావలి మండలం, సర్వాయపాలెం పంచాయతీ పరిధిలోని తాగేటివారిపాలేనికి చెందిన చాట్ల వాసు (26) మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి తన మేకల మంద సంరక్షణ బాధ్యతలను వాసుకు అప్పగించాడు. ఇటీవల ఆ మందలోని ఒక మేక ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.
పంపకాల గొడవ: ఆ మేకను క్షేమంగా కాపాడి, పిల్లలు పుట్టేలా చూసినందుకు ప్రతిఫలంగా తనకు రెండు మేక పిల్లలను ఇవ్వాలని వాసు డిమాండ్ చేశాడు.
యజమాని నిరాకరణ: అయితే, మేకలను కాపలా కాస్తున్నందుకు గాను ప్రతి నెలా జీతంగా కూలీ ఇస్తున్నానని, కాబట్టి అదనంగా మేక పిల్లలను ఇవ్వడం కుదరదని యజమాని జనార్దన్ తేల్చి చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో గొడవ జరుగుతోంది.
రంగంలోకి మాజీ సర్పంచ్.. మద్యం షాపులో స్కెచ్!
ఈ వివాదం కాస్త పెద్దదవ్వడంతో జనార్దన్ గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ అయిన మందా మధు (Manda Madhu) దృష్టికి సమస్యను తీసుకెళ్లాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఊరిలో పంచాయితీ పెట్టారు. ఈ సమయంలో వాసుకు, మాజీ సర్పంచ్ మధుకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. గ్రామ పెద్దనైన తనకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ మధు మనస్తాపానికి గురయ్యాడు. ఎలాగైనా వాసుకు బుద్ధి చెప్పాలని ఒక కిరాతక ప్లాన్ వేశాడు.
పథకం ప్రకారం.. ఈ నెల 10వ తేదీన వాసును నమ్మించి, అడవిరాజుపాలెంలోని ఒక మద్యం దుకాణానికి (Liquor Shop) తీసుకువెళ్లాడు. అక్కడ వాసుతో పరిమితికి మించి మద్యం తాగించారు. వాసు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక, మాజీ సర్పంచ్ మధు తన ముగ్గురు అనుచరులతో కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. కర్రలు, రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
చికిత్స పొందుతూ మృతి.. నిందితుల అరెస్ట్...
రక్తసిక్తంగా పడి ఉన్న వాసును గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొదట మద్యం మత్తులో బైక్ పై నుంచి కిందపడి గాయపడ్డాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో స్పృహలోకి వచ్చిన వాసు.. మాజీ సర్పంచ్ మధు, అతని అనుచరులు తనను చంపడానికి ఎలా దాడి చేశారో కుటుంబ సభ్యులకు వివరించాడు.
అసలు నిజం చెప్పిన కొద్దిసేపటికే వాసు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడి మరణంతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు కావలి రూరల్ పోలీసులకు (Kavali Rural Police) ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు, మాజీ సర్పంచ్ మందా మధుతో పాటు అతనికి సహకరించిన పందల రవిచంద్రను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Be the first to react
